నారా లోకేష్ తో కేటీఆర్ సీక్రెట్ మీటింగ్.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మీడియాతో చిట్ చాట్ చేశారు. కేటీఆర్, కవిత, కేసీఆర్ లపై ఆయన చేసిన చిట్ చాట్ ఆసక్తితో పాటు షాకింగ్ గా ఉంది. కేసీఆర్ కుటుంబంలో నాయకత్వంపై గొడవ జరుగుతుందన్నారు. కేటీఆర్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కేసీఆర్ ఎందుకు ఒప్పుకోవటం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితకు.. ఆమె ఇంట్లోనే ఆమెకు విలువ లేదని.. చెల్లి కవితనే కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోవటం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో.. స్లీపింగ్ ప్రెసిడెంటో నాకేం తెలుసు.. కొందరు సూసైడల్ టెండెన్స్ తో బాధపడుతున్నారంటూ సచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ అర్ధరాత్రి లోకేష్ ని కలవాల్సిన పని ఏముంది అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇప్పటికి మూడు సార్లు లోకేష్ ని కేటీఆర్ కలిశారన్నారు. లోకేష్ ని కేటీఆర్ ఎందుకు కలవాల్సి వచ్చిందో చెప్పగలరా అంటూ మీడియా చిట్ చాట్ సందర్భంగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా ఎవరితోనూ శతృత్వం, వైరుద్యం లేదని.. కేసీఆర్ సైతం ఆయనకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేయాల్సినంత నష్టాన్ని చేశారని.. 2004 నుంచి 2014 వరకు 700 టీసీఎంల నీటిని రాయలసీమకు అక్రమంగా తరలించారన్నారు. నీళ్ల విషయంలో కేసీఆర్ చేసిన అన్యాయాన్ని తెలంగాణ రైతులు ఎప్పటికీ క్షమించరన్నారు.
బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కు ఓ గంజాయి బ్యాచ్ ఉందని.. కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని.. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ పరీక్షకు రమ్మంటే పారిపోయింది ఎవరు అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. కేటీఆర్ పార్ట్‌నర్, ఫ్రెండ్ అయిన కేదార్.. డ్రగ్స్ తీసుకుని దుబాయ్ లో చనిపోయాడని.. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ మొత్తం తెప్పించానన్నారు. బాత్రూం కడిగేవాళ్లతో చర్చకు తాను పోను అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డికి సోడా పోయటం తప్ప ఇంకేమీ తెలియదన్నారు.