బనకచర్ల ఊసేలేని సీఎంల భేటీ..!
* 4 అంశాలపైనే ప్రధానంగా చర్చ
* నీటి వాటాలపై ఇంజినీర్లు, అధికారులతో కమిటీ
* ఆ తర్వాతే సీఎంల స్థాయిలో చర్చిస్తాం
* ఏపీకి అన్ని నదులను దారాదత్తం చేసిన కేసీఆర్
* వివాదాలు సృష్టించడమే బీఆర్ఎస్ పని
* ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
ఢిల్లీ వేదికగా శ్రమశక్తి భవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం బనకచర్ల ప్రస్తావన రాకుండానే ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన చర్చల్లో కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై ఉన్న సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. నీటి వివాదాలే అజెండాగా గంటన్నరపాటు ఇరు రాష్ట్రాల సీఎంలు, అధికారులు చర్చలు జరిపారు. సమావేశం అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బనకచర్ల ప్రతిపాదనే రాలేదు
ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు గురించి ప్రతిపాదనే చేయలేదని.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఏపీ ప్రభుత్వం తమ అజెండాలో బనకచర్ల ప్రాజెక్టు కడతామనే ప్రతిపాదనే చర్చకు రానప్పుడు... ఇక తెలంగాణ తరుఫున ఆపాలన్న చర్చే ఉండదు కదా అన్నారు. పైగా ఇది అపెక్స్ కమిటీ భేటీ కాదని రేవంత్ స్పష్టం చేశారు. ఈ భేటీలో ప్రధానంగా 4 అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు రేవంత్ తెలిపారు.
1) గోదావరి, కృష్ణా నదుల నీటి వాటాల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకున్న సమస్యలపై ఇంజినీర్లు, అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. కమిటీలోని సభ్యులు నీటి సమస్యలను గుర్తించి వాటిపై చర్చించిన అనంతరం.. సీఎంల స్థాయిలో మరోసారి చర్చిస్తామని రేవంత్ చెప్పారు.
2) కృష్ణానదిలో ఏపీ, తెలంగాణ నీటి వాటాల విషయంలో టెలిమెట్రో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
3) శ్రీశైలం ప్రాజెక్ట్ కు కొంత డ్యామేజ్ జరిగింది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కేంద్రం ఏపీకి సూచించగా.. అందుకు వారు అంగీకరించారు.
4) విభజన చట్టం ప్రకారం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డులు ఏపీలో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని ఉంది. ఇదే ప్రతిపాదనను ఇప్పుడు అమలు చేయాలని కోరామని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో అన్నారు.
ఏపీకి నదులను దారాదత్తం చేసిన కేసీఆర్
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ హక్కులను ఆంధ్రాకు దారాధత్తం చేశారని ఆరోపించారు. వాటిని పరిష్కరించడానికి మేం ప్రయత్నిస్తున్నామని.. సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు తెలుసు.. కానీ బీఆర్ఎస్ నేతలకు వివాదాలు సృష్టించడమే కావాలని రేవంత్ విమర్శించారు. విభజన చట్టంలో చాలా అంశాలను పొందుపరిచినా అవిఅమలు కాలేదు. ఇప్పుడు వాటి గురించి మేం ప్రయత్నాలు చేస్తున్నామని రేవంత్ తెలిపారు.