YS Jagan Comments: జగన్ రప్పా..రప్పా కామెంట్స్ సరైనవేనా..? చట్టం ఏం చెబుతోంది..?
పొలిటిషియన్స్ ఏమైనా మాట్లాడొచ్చా..?
రప్పా రప్పా నరికేస్తాం..! అంటే సరైనదేనా..?
ఇలాంటి కామెంట్స్ పై చట్టం ఏం చెబుతోంది..?
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఓ డైలాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఇది కూటమి ప్రభుత్వం అభివృద్ధి గురించో.. వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీసే అంశం గురించో కాదు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ట్రెండింగ్ వర్డ్ "రప్పా రప్పా". పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ఆ మూవిని హిట్ చేస్తే.. రియల్ లైఫ్ లో మాత్రం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. మొన్నామధ్య మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన సందర్భంగా ఓ అభిమాని టీడీపీ వాళ్లను రప్పా రప్పా నరుకుతాం అంటూ ప్లకార్డ్ ప్రదర్శించాడు. అందుకు అతడిపై కేసులు కూడా పెట్టారునుకోండి. ఐతే ఇదే డైలాగ్ ను జగన్ సపోర్ట్ చేయడం.. ఆ తర్వాత రెండు మూడు సందర్భాల్లో రప్పా రప్పా అంటూ మాట్లాడటం జరిగిపోయాయి.
బుధవారం ప్రెస్ మీట్ సందర్భంగా మేం అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్లను, వాళ్లకు సపోర్ట్ చేసిన వాళ్లను ఉద్దేశిస్తూ గట్టివార్నింగే ఇచ్చారు. రప్పా రప్పా డైలాగ్ సినిమాల్లో నచ్చినప్పుడు.. మేం రియల్ లైఫ్ లో ఎందుకు వాడకూడదంటూ ఎదురు ప్రశ్నించారు. సినిమాల్లో నచ్చిన డైలాగ్.. నిజజీవితంలో ఎందుకు నచ్చదు.? ఇలాంటి డైలాగ్స్ కు సెన్సార్ బోర్డు ఎందుకు ఒప్పుకుందనేవి జగన్ వేస్తున్న ప్రశ్నలు.
ఐతే ఇంత వరకు బాగానే ఉన్నా.. ఏ రాజకీయ నాయకుడైనా, రాష్ట్రానికి సీఎం అయినా, మాజీ సీఎం అయినా.. ప్రజలను ప్రభావితం చేసే పదవుల్లో, స్థానాల్లో ఉన్నప్పుడు కాస్త కంట్రోల్డ్ గానే మాట్లాడాలని విశ్లేషకులంటున్నారు. సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతి సినిమాల వరకే గానీ.. రీల్ లైఫ్ లో వాడితే శిక్ష తప్పదు అంటోంది భారతీయ న్యాయ సంహిత. ఇది ఏ పార్టీ వారికైనా, ఏ స్థాయిలో, ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నవారికైనా వర్తిస్తుంది.
ఇలాటి వ్యాఖ్యల విషయంలో.. మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులు అంటున్నట్లు "రప్పా రప్పా నరికేస్తాం" లాంటి పదజాలాన్ని బహిరంగ సభల్లోగానీ, మీడియా సమావేశాల్లో గానీ ఉపయోగిస్తే అది హింసను ప్రేరేమించే హెచ్చరికగా చట్టం పరిగణిస్తుంది. ఇది భారత చట్టాల ప్రకారం నేరం. ఇలాంటి హెచ్చరికలు, వ్యాఖ్యలను. భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 351(2) కింద నేరంగా పరిగణించడం జరుగుతుంది. ఈ సెక్షన్ ప్రకారం, ఎవరైనా హాని కలిగించే ఉద్దేశ్యంతో బెదిరించడం లేదా భయపెట్టే విధంగా మాట్లాడితే నేరపూరిత బెదిరింపుల కిందకు వస్తుంది. ఇది శిక్షార్హమైన నేరం. దీనికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశముంది. అంతేకాదు దీనికి BNS సెక్షన్ 152 కూడా దీనికి వర్తిస్తంది. దేశ సమగ్రతకు లేదా శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో హింసను ప్రేరేపిస్తే చట్టం ప్రకారం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చట్టంలో ఇంత స్పష్టంగా ఉన్నందున ఒక్క జగన్ మాత్రమే కాదు.. వైసీపీలోని ఇతర నాయకులు, టీడీపీ, జనసేన పార్టీల్లో ఆరోచించకుండా మాట్లాడే నేతలు కూడా ఏదైనా మాట్లాడేముందు కాస్త ఆలోచించుకొని మాట్లాడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. రప్పా రప్పా కామెంట్స్ విషయంలో జగన్ వాటిని సమర్ధించేకంటే ఖండిస్తే మరింత బాగుండేదనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.