జనాభా గణనకు కేంద్రం నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా జనాభా గణన చేపట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇప్పటికే తీసుకున్న కేబినెట్ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా జన గణనలోనే భాగంగా కుల గణన కూడా చేపట్టనున్నారు. దేశంలో రెండు విడతలుగా ఈ జనాభా గణన ప్రక్రియ చేపట్టబోతున్నారు. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో జన గణన మొదలు కానుండగా.. మిగతా రాష్ట్రాల్లో 2027లో ఈ ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో చేపట్టే జనగణన ముందుగా వచ్చే ఏడాది అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చేపడతారు. అలాగే 2027 మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టబోతున్నారు. అలాగే ప్రతీ రాష్ట్రంలోనూ రెండు దశల్లో జనాభా గణన చేపడతారు. నిన్న జనగణన కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ తో ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఇందులో ఈ తేదీల్ని ఖరారు చేశారు.