లోగుట్టు ఆ సారుకే ఎరుక..
ప్రభాకర్ రావు విచారణలో రోజుకో కొత్త పేరు..
తాజాగా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి పేరు వచ్చినట్లు సమాచారం..
సిట్ కార్యాలయానికి క్యూ కడుతున్న సాక్షులు..
నోటీసుల మీద నోటీసులు సిద్ధం చేస్తున్న అధికారులు..
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సస్పెన్స్.. క్రైమ్.. థ్రిల్లర్ సీరియల్ తరహాలో సాగుతోంది. రోజుకో ట్విస్ట్ జనాలను తికమక పెడుతోంది. ఉదయం నుండి సాయంత్రం6 గంటల వరకు సాగుతున్న ఎపిసోడ్ ఒళ్లు గగ్గురపొడిచేలా.. రోమాలు నిక్కపొడిచేలా మారుతోంది. ఒక్కోరోజు ఒక్కో పేరు.. పంచ్ ల మీద పంచ్ లు సిట్ ని సైతం విస్సుపోయేలా చేస్తోంది. చంద్రబాబు, లోకేష్, షర్మిల ఇలా పాపులర్ నేతల ఫోన్ల ట్యాపింగ్ సరే. తాజాగా అప్పటి డిజిపి, ప్రస్తుత టీఎస్పిఎస్సి అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేందర్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. అంతా బాస్ కె తెలుసు.. ఆయన ఆధ్వర్యంలోనే సాగింది. ఆయనకు తెలియకుండా పోలీస్ శాఖలో ఏమి జరగలేదు అని విచారణకు మరోసారి హాజరైన ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధకిషన్ రావు, మీడియా అధినేత శ్రవణ్ ల స్టేట్మెంట్ తో ప్రభాకర్ ఏ1 గా మారాడు. విదేశాల నుండి వచ్చిన ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతో సుమారు 600 ఫోన్ ట్యాపింగ్ సమాచారం సేకరించిన సిట్ ఒక్కొక్కరికి విషయం చెప్పి, బీజేపీ, కాంగ్రెస్ నేతల స్టేట్మెంట్ లను సాక్షులుగా స్వీకరించారు. ఇక ఫైనల్ కేసిఆర్ అనేకునే సరికి జగన్ కోసం బిఆర్ఎస్ బాస్ చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. దీనితో ట్యాపింగ్ షాకింగ్ ఆంధ్రాలో కూడా షేక్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో అప్పటి హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ప్రస్తుత డీజీపీ జితేందర్, ఇంటలీజెన్స్ ఎడిజిగా అనీల్ కుమార్ స్టేట్మెంట్లు కూడా నమోదు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీ రోల్ లో ఉన్న అధికారులంతా తమ పై బాస్ మహేందర్ రెడ్డికే తెలుసునని, తాజాగా ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మహేందర్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావులను కలిసి విచారించిన, సాక్షుల వాంగ్మూలం ముందు పెట్టి విచారణ చేసిన కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ కేసును క్లోజ్ చేయాలని భావిస్తున్న రోజుకో విషయం సిట్ ని కలవరపరుస్తోంది.
ప్రభాకర్ రావు విచారణ తరువాత సిట్ కేసీఆర్ కి నోటీసులు ఇచ్చి ఆయనను విచారణ చేయాలని అనుకున్నారు. దీనితో ఈ కేస్ ముగింపుకి వస్తుందని భావించారు. కానీ అనుకోని అధికారులు జితేందర్, అనీల్ కుమార్ ప్రస్తావన రావడంతో వారి వాంగ్మూలం కూడా సేకరించారు. తాజాగా మహేందర్ రెడ్డిని విచారించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో సాక్షులు స్టేట్మెంట్ ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. సిట్ సేకరించిన ఫోన్ డేటా ఆధారంగా వారికి సమాచారం ఇచ్చి మరీ వాగ్మూలం తీసుకుంటున్నారు. ఏదిఏమైనా రోజుకో కొత్త పేరు బయటకు రావడంతో తలపట్టుకుంటున్న సిట్ అధికారులు, దర్యాప్తు ఎలా ముందుకు తీసుకుపోవలన్నా దానిపై ఆలోచనలో పడినట్లు సమాచారం.