వంశీ బిల్డర్స్ ని హైడ్రా టచ్ చేయదా...? రేవంత్ రెడ్డి అడగరా?

On
వంశీ బిల్డర్స్ ని హైడ్రా టచ్ చేయదా...? రేవంత్ రెడ్డి అడగరా?

రేవంత్ రెడ్డి పాలనలో సామాన్యుడే సమిధనా..
ఖాజాగుడా కబ్జాపై నోరువిప్పని హైడ్రా..
కోర్టులో కేసు ఉందంటూ తప్పించునే ప్రయత్నం..
2000కోట్ల భూమికి ఎసరు అంటూ కోర్ట్ లో పిల్ వేసిన ఎమ్మెల్యేలు..
అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న పట్టించుకోని ప్రభుత్వం..
యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్న వంశీ బిల్డర్స్..

By V Krishna kumar

Tpn: స్పెషల్ డెస్క్..

హైడ్రా ఈ వ్యవస్థ ఏర్పాటు అయ్యాక సామాన్యుడు ఇల్లు కట్టాలన్న.. కొనాలన్న భయంతో వణికిపోయే రోజులు ఏర్పడ్డాయి. కష్టపడి అప్పోసోప్పో చేసి కట్టుకున్న ఇల్లు ఎప్పుడు కూలగొడతారో తెలియని పరిస్థితులు. ప్రభుత్వ భూములు, చెరువులు, బఫర్ జోన్ లు, ఎఫ్ టి ఎల్ లు ఇలా చెప్పుకుంటూ పోతే ఏది తేడా అనిపిస్తే అది కులగొట్టడమే. ఏడాదిన్నర రేవంత్‌రెడ్డి పాలనలో సామాన్యుడే సమిధగా మారాడు. నిరుపేద ప్రభుత్వ భూమిలో గుడిసె వేసినా సామాన్యుడు లక్షలు పెట్టి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్నా జీహెచ్‌ఎంసీ.. హైడ్రా.. రెవెన్యూ.. ఇరిగేషన్‌  తెల్లారకముందే ఏదో ఒక రూపంలో బుల్డోజర్‌ వచ్చేస్తారు. నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసి ఆ కుటుంబాలను వీధినపడేస్తన్నారు.. ఇదేమంటే… స్థానికులే ఫిర్యాదు చేశారని సమాధానాలిస్తారు. ఇంత వరకు ఒకే అయిన వారికి వెండి కంచాల్లో, కానీ వారికి విస్తరకుల్లో వడ్డించినట్లు ఉంది. అచ్చం అలానే నగరం నడిబొడ్డులో ఒకటి కాదు రెండు కాదు అచ్చంగా 2000 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్నా.. బహుళ అంతస్తు భవనాలు నిర్మాణం అవుతున్న పట్టించుకునే నాధుడే లేడు. ఇది ఏ ప్రతిపక్షం చేసిన ఆరోపణలు కావు సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసినవే.  ఈ ఏడాది మార్చి 13న సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మీడియా ముందు ఒక ఫిర్యాదు చేశారు. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో చెరువును ఆక్రమించి వంశీ బిల్డర్స్ నిర్మాణ సంస్థ ఆకాశహార్మ్యాలు నిర్మిస్తున్నదని ఆరోపించారు. హైడ్రాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణ ప్రాజెక్టు చేపట్టిన 27.18 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమి అని వివరించారు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఏకంగా హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఖాజాగూడ పరిధిలోని సర్వే నంబరు 27లో చెరువును కబ్జా చేయడంతోపాటు 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిలో వంశీ బిల్డర్స్ నిర్మాణ సంస్థ అక్రమంగా బిల్డింగులు నిర్మిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఏడాదిన్నరగా నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు చెందిన వందల నిర్మాణాలను కూల్చివేసిన ప్రభుత్వ, అధికార యంత్రాంగం దాదాపు రూ.2వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడటంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. ప్రజలకు చెందిన విలువైన భూములు, ఓ నీటి వనరును కాపాడటంతో సొంత ప్రభుత్వంలోనే న్యాయం దొరకడంలేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టు తలుపుతట్టారు. 
ఖాజాగూడ పరిధిలోని సర్వేనంబర్‌ 27లో సుమారు 64.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 27.18 ఎకరాల భూమిపై 80వ దశకం నుంచి న్యాయస్థానంలో వివాదం కొనసాగుతోంది. 2022లో అప్పటి జిల్లా ఉన్నతాధికారి దానికి ఎన్‌వోసీ ఇవ్వడం దాని ఆధారంగా వంశీ బిల్డర్స్ అనే నిర్మాణ సంస్థ అక్కడ సుమారు 59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు టవర్లను నిర్మించేందుకు అనుమతి తీసుకున్నది. అప్పటి ప్రభుత్వ పెద్దలు విషయం తెలుసుకొని ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. వాళ్ల ఆదేశానుసారం సీసీఎల్‌ఏ ఉన్నతాధికారి జిల్లా ఉన్నతాధికారి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతోపాటు ఎలాంటి అనుమతులు చెల్లవని ఉత్తర్వులు ఇచ్చారు. ఆ భూమిలో సదరు సంస్థ వేసిన షెడ్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో 2023 డిసెంబరు వరకు ఆ ప్రభుత్వ భూమి సర్కారు ఆధీనంలోనే ఉంది.
కాగా గత ప్రభుత్వ హయాంలో సర్కారు ఆధీనంలోనే ఉన్న ఆ భూములు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు వశమయ్యాయి. ప్రభుత్వ భూముల్ని తమ ఆధీనంలోకి తీసుకున్న సదరు వంశీ బిల్డర్స్ నిర్మాణ సంస్థ పక్కన ఉన్న చెరువు మీదా కన్నేసి అందులో మట్టి పోసింది. ఈ క్రమంలో ఏడాదిగా అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు అంతస్తుల నిర్మాణం పూర్తయింది. ఖాజాగూడలో ఎకరా ధర కనీసం రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంది. అంటే 27.18 ఎకరాల భూమి విలువ రూ.2000 కోట్ల పైమాటే. రాష్ట్రంలో, ప్రధానంగా హైదరాబాద్‌, చుట్టుపక్కల గత ఏడాదిన్నరగా సామాన్యుడు ఇంచు ప్రభుత్వ భూమిలోకి జరిగినా, గజం చెరువు బఫర్‌లో కలిసినా నిర్దాక్షిణ్యంగా నేలకూలుతున్నాయి. కానీ నెలల తరబడి ప్రభుత్వ, అధికార యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి చూడ లేదు. దీంతో తెరవెనక పెద్దలెవరూ లేకుండా ఈ నిర్మాణాలు కొనసాగవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఓ ప్రైవేటు సంస్థ పాగా వేసి దర్జాగా ఏడాది నుంచి భారీ నిర్మాణ ప్రాజెక్టును కొనసాగిస్తున్నదంటే తెర వెనక చక్రం తిప్పింది ఎవరు? అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారింది.  అనేక ఇండ్లను నేలమట్టం చేసిన హైడ్రా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లు ఎఫ్ టీఎల్ లో వున్నా కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు అనే ఆరోపణలు లేక పోలేదు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో హైదరాబాద్‌ మహా నగరంలో సుమారు రూ.15వేల కోట్ల విలువైన 11 భారీ నిర్మాణ ప్రాజెక్టులు అక్రమమని చెప్పారు. మరి ఆయనకు ఖాజాగుడా నిర్మాణాలు కనపడటం లేదా అని జనం ప్రశ్నిస్తున్నారు.
హైకోర్టులో విచారణ...
శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ నలుగురు ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మురళీనాయక్ పిల్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఖాజాగూడలోని సర్వే నెంబర్ 119, 122లో ఉన్న 27.18 ఎకరాల భూమిని ఆక్రమించారన్నారు. సర్వే నెంబర్ మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని చెప్పారు. భూమి విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని తెలిపారు.
రంగారెడ్డి కలెక్టర్ 2023లో నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని న్యాయవాది పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో 8 టవర్లు నిర్మిస్తున్నారని, ఒక్కో దాంట్లో 47 అంతస్తులు ఉన్నాయని వివరించారు. ఇవన్నీ ఖాజాగూడ చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఓ ప్రేవేటు పాఠశాలకు 150 మీటర్ల పరిధిలోనే రెడీమిక్స్ ప్లాంటు ఏర్పాటు చేశారని చెప్పారు. దీంతో పర్యావరణం కాలుష్యమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది వివరించారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని చిక్కుడు ప్రభా కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, రంగారెడ్డి కలెక్టర్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైడ్రాకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.WhatsApp Image 2025-06-19 at 09.49.57

Advertisement

Latest News

ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై...
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.
డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం