ఏపీ పెట్టుబడులపై చర్చకు దారితీసిన ఓ యాడ్..! ఏంటా కథ?
మహీంద్రా నుంచి ఫ్యూరియో ట్రక్ తెలుగు అడ్వర్టైజ్మెంట్ను తన ఎక్స్ వేదికగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు. ‘‘ఒక్క నిర్ణయం చాలు.. మీ విధి మీ చేతుల్లో ఉంది. ట్రక్‌ను సొంతం చేసుకోండి.. జీవితం మార్చుకోండి’’ అంటూ తెలుగులో ఆ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టారు.
https://twitter.com/naralokesh/status/1946220753608937670
ఎక్స్ లో ఆ వీడియోను చూసిన ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్.. ప్రకటన హృదయాన్ని హత్తుకునేలా ఉందంటూ ప్రశంసిస్తూ ట్వీట్ తో బదులిచ్చారు. మహీంద్రా వాహనాలకు అతిపెద్ద మార్కెట్ అయిన ఆంధప్రదేశ్ ప్రజలకు కూడా ఇది నచ్చుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులకు అన్ని అవకాశాలున్న ఏపీలో మహీంద్రా తయారీ కేంద్రాన్ని నెలకొల్పే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా లోకేశ్ కోరారు. దీనికి ఆనంద్ మహీంద్రా ఈ విధంగా రీ ట్వీట్ చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. రాష్ట్రంలో సోలార్ ఎనర్జీ, మైక్రో ఇరిగేషన్, టూరిజం విభాగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై తమ బృందాలు ఆంధ్రప్రదేశ్‌తో చర్చలు జరుపుతున్నాయని పేర్కొన్నారు. ‘మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. మున్ముందు ఏమవుతుందో చూద్దాం’ అంటూ లోకేశ్ ట్వీట్ పై తెలుగులోనే పోస్ట్ పెట్టి మహీంద్ర ఆశ్చర్చపరిచారు.