ఆ స్కూల్ లో పాఠాలు కాదు..డ్రగ్స్ తయారీ నేర్పిస్తారు..
- సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో వెలుగు చూసిన దారుణం..
- స్కూల్ లో డ్రగ్స్ తయారీ బయటపెట్టిన ఈగల్ టీమ్..
- ఉదయం డ్రగ్స్ దందా.. సాయంత్రం ట్యూషన్స్..
పాఠాలు నేర్పించాల్సిన గురువే.. దారితప్పుతున్నాడు.. తప్పటడుగులు వేసే విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నాడు. ఒకపక్కన నీతి పాఠాలు చెబుతూనే మరోపక్కన పరువుపోయే పనులు చేస్తున్నారు. గురు బ్రమ్మ..గురు విష్ణు అనే పద్యానికే కళంకం తెస్తున్నారు. ఉన్న డబ్బులు సరిపోవంటూ డ్రగ్స్ వ్యాపారులే మొదలు పెట్టారు.
తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈగల్ టీమ్ .. మత్తు దందా చేసేవారి గుట్టు రట్టు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మత్తు పదార్థాల రవాణా, విక్రయం, వాడే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటోంది. ఒకపక్కన మహారాష్ట్ర పోలీసులు దాడి చేసి చర్లపల్లిలో 12వేల కోట్ల రూపాయల డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు చేయగా, తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఈగల్ టీమ్ అధికారులు పట్టుకున్నారు. ఏకంగా స్కూల్ అడ్డాగా చేసుకుని.. మత్తుమందుల తయారీ చేస్తున్న ఒక అక్రమ ఫ్యాక్టరీని ఈగల్ టీమ్ బహిర్గతం చేసింది. గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందా ఆటను కట్టించింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో ఉన్న మేధా హై స్కూల్ లోపల నిషేధిత ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని భారీగా తయారు చేసి.. బయటికి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న ఈగల్ టీం అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసులో గౌడ్ అనే వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు.. అతడితో పాటు నలుగురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. మేధా హై స్కూల్‌ను తమ అడ్డాగా చేసుకున్న గౌడ్ అనే వ్యక్తి.. దాన్ని పగటి వేళ డ్రగ్స్ తయారీకి ఉపయోగించేవాడు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. సాయంత్రం వేళల్లో స్కూల్‌లో ట్యూషన్ తరగతులు కూడా నడిపిస్తున్నట్లు ఈగల్ టీమ్ దాడిలో వెల్లడైంది. ఈ డ్రగ్స్ తయారీ దందా చాలాకాలంగా నడుస్తున్నట్లు విచారణలో తెలిసింది. ఇక ఈ మేధా హైస్కూల్‌లో తయారు చేస్తున్న ఆల్ఫా జోలం అనే మత్తుమందు అత్యంత ప్రమాదకరమైందని అధికారులు వెల్లడించారు. స్కూల్ లోనే ఇలాంటి డ్రగ్స్ తయారు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారి వల్ల తమ పిల్లల భవిష్యత్తు ఏంటి అని భయపడుతున్నారు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే ఈ దందానే కాదు నిందితులు సైతం భయపడేలా చేయాలని కోరుతున్నారు. ఏదిఏమైనా ఇటీవల కాలంలో సిటీలో డ్రగ్స్ దందాలు వరుసగా వెలుగు చూడటం మింగుడు పడని వ్యవహారం అయ్యింది. చర్లపల్లిలో మూసేసిన ఫ్యాక్టరీని దుండగులు అడ్డాగా చేసుకుంటే.. ఇక్కడ పిల్లలు లేని స్కూల్ ని దుండగులు తమ డ్రగ్స్ తయారీ స్థావరంగా మార్చుకున్నారు.