"మాతృభాష అమ్మ..హిందీ భాష పెద్దమ్మ..!" పవన్ కళ్యాణ్ హిందీ భాషాభిమానంపై కాంట్రవర్సి!

By Dev
On

ఇటీవల జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ చేసిన "మాతృభాష అమ్మ లాంటిది, హిందీ పెద్దమ్మ లాంటిది" అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై మాతృభాష ప్రేమికులు, భాషా సంఘాలు సహా నటుడు ప్రకాశ్ రాజ్ వంటి వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?..

గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం ‘రాజభాష విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనం’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ "మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ’’ అని వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. హిందీ మనది అని.. ఆ భాషను ప్రేమిద్దాం అని, ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. హిందీని రాజభాషగా ఆయన అభివర్ణించారు. నాగరికత ముసుగులో ఆంగ్ల భాషను సొంతం చేసుకున్న మనమే హిందీని మనభాష అని అనుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, వ్యాపారాల కోసం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి భాషలు నేర్చుకుంటున్నామని, మరి.. మన దేశానికే చెందిన హిందీ నేర్చుకునేందుకు ఎందుకు భయపడుతున్నాం? ఆ భాషను ఎందుకు ద్వేషిస్తున్నాం? అని ప్రశ్నించారు. హిందీ నేర్చుకోవాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని, అయితే అది ఎవరైనా తేలిగ్గా అర్థం చేసుకోగలిగే భాష అని ఆయన ప్రసంగం కొనసాగింది. లాభం ఉందనుకున్నప్పుడు కొందరు హిందీని నిస్సంకోచంగా ఉపయోగిస్తూ అదే హిందీని చిల్లర రాజకీయాల కోసం వ్యతిరేకిస్తున్నారని తనదైన శైలిలో స్పందించారు పవన్ కళ్యాణ్.

    https://www.youtube.com/watch?v=4_p0O5nhfyo


నిజానికి మాతృభాష కన్నా హిందీ భాషపై పవన్ కళ్యాణ్ కు మక్కువ ఎక్కువైంది అన్న విధంగా పలువురు నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఇదే పవన్ కళ్యాణ్.. హిందీ భాష అనేది బిజెపికి సొంతమని హిందూ భాష కాదు, హిందీ భాష బిజెపికి సొంతం అన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.  హిందీ భాష పెద్దమ్మ లాంటిది అనడం వెనుక ఉత్తరాది ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ నెత్తినపెట్టుకోవడం అంటూ అసహనం వ్యక్తమవుతోంది. ఈ రేంజ్ కి అమ్ముడుపోవడమా? ఛీ ఛీ అంటూ విమర్శకులు , నటులు ప్రకాశ్ రాజ్ వంటి వారు తీవ్రంగా స్పందించారు. 800 ఏళ్లుగా మనుగడలో ఉన్న హిందీ భాష 2వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న తెలుగు భాష పెద్దమ్మ ఎలా అవుతుందో చెప్పాలని భాషాభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. హిందీ భాష కావచ్చు..కానీ అందరి భాష హిందీ కావాలనుకోవడాన్ని దక్షిణాది అంగీకరించదు. ఏ భాషనైనా గౌరవించాలి..కానీ బలవంతంగా ఎక్కించాలనుకోకూడదు. అన్ని భాషలతో కలిసి నడవాలి కానీ ఒక భాషలోనే అందరూ నడిస్తే అది భిన్నత్వంలో ఏకత్వం అన్న భారతదేశ సిద్ధాంతాన్నే తుడిచివేయడం కాదా? విభిన్న కులాలు, మతాలు, భాషలైనా కలిసి నడిచే ఏకైక దేశం మన భారతదేశం అన్న మాట పవన్ కళ్యాణ్ మరిచారా? ఒక తాటిపైన నడవడం, నడిపించడం అవసరమే కానీ ఒక భాషతోనే జీవించాలని చెప్పడమే ఎవరూ హర్షించరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో  పవన్ భవిష్యత్ ను లిఖించిన అమ్మభాష కన్నా లిపి లేని భాషపై అంత ప్రేమెందుకు? అంటూ ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. హిందీ పెద్దమ్మ అయితే ఇంగ్లీష్ పిన్ని, రష్యా అత్త అంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఏ మే రాజహా అంటూ ఖుషీ సినిమాలో హీరోయిజం పాటను కూడా హిందీపై అభిమానంతో పెట్టానని పవన్ చెప్పడం మరింత హాస్యాస్పదం. బీజేపీ మెప్పు పొందడమే లక్ష్యంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇంత గొప్పగా పెద్దమ్మ అంటూ హిందీ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గతంలో ఇదే హిందీ భాష గురించి 2019 ఎన్నికలకు ముందు విభేదించినపుడు  మాట్లాడిన విషయాలన్నీ తెరపైకి తెచ్చి ప్రశ్నిస్తున్నారు. అప్పుడు రాజ్యాంగాన్ని , రాష్ట్రాన్ని అగౌరవపరచడమే అని పవన్ మాట్లాడిన మాటలు ఒక్కసారిగా ఇలా మారిపోయాయేంటంటూ నిలదీస్తున్నారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్  ఓ టీవీ ఛానల్ విశ్లేషణలో పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇంగ్లీష్ ఇంటి అల్లుడిలా మారిపోయి..పెద్దమ్మ, అమ్మను కూడా పక్కనపెట్టేలా పరిస్థితులు తయారయ్యాయని ఆయన  విశ్లేషించారు. ఎవరు అవునన్నా కాదన్నా హిందీని బలవంతంగా రుద్దడం, తప్పనిసరిగా నేర్చుకోవాలనే హుకుం తగదన్నారు. అత్యంత మాతృభాష ప్రేమికులైన తమిళులు, తమిళ్, హిందీ భాషలతోనే రాణిస్తున్నారన్నారు. ఏ రంగంలో తమిళనాడు వెనుకబడిందో చెప్పాలని ప్రశ్నించారు.

Advertisement

Latest News

మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం! మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం!
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!
దేశవ్యాప్తంగా బిల్లులు బెంబేలెత్తిస్తుంటే అక్కడ మాత్రం ఫ్రీ కరెంట్!
తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం!
బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా?
నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!
చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..!
ఫోన్ ట్యాపింగ్ కేసు - కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారు?