అభిమానానికి తగిన గుర్తింపు దక్కిందా? ..జనసేనాని పవనే దిక్కంటున్న ఆ కుటుంబం..
జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ బహిష్కృత నేత వినూత కోట మాజీ కారు డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య అనంతర పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. 2017లో విడుదలైన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా తర్వాతనే డ్రైవర్ శ్రీనివాసులు రాయుడుగా పేరు మార్చుకుని అదే పేరుతో పాపులర్ అయ్యాడు. అప్పుడు ఆ అబ్బాయి వయసు సుమారు 15 సంవత్సరాలు. పవన్ కళ్యాణ్‌ను ఇలా దేవుడిలా ఆరాధించి అనుసరించే యువత రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఉంటారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసం పాలెం రాయుడు స్వగ్రామం. ఆయన సొంత మామ కె.సుబ్రమణ్యం గత పదేళ్లుగా వైఎస్ఆర్సీపీ తరపున గ్రామ సర్పంచ్. అయినా సరే నేను జనసేనాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని అని అందరికీ చెప్పుకుంటూ కాలరెగరేసుకుని తిరిగేవాడు.
2018లో మాజీ జనసేన వీరమహిళ వినుత రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె దగ్గర చేరితే పవన్ కళ్యాణ్ ను నేరుగా చూడొచ్చనే ఒకే ఆలోచన ఆశయమై డ్రైవింగ్ రాకపోయినా నేర్చుకుని మరీ ఆమె దగ్గర డ్రైవర్ అయ్యాడు. తాను జనసేన సభ్యత్వం తీసుకోవడమే కాకుండా..తన స్నేహితులు, సన్నిహితులను కూడా 200మందిని జనసేనలో చేర్పించేంత అభిమానం కాటమరాయుడంటే ఈ రాయుడికి. వినుత దంపుతల కు దగ్గరై వారికి కెమెరామెన్, సోషల్ మీడియా, డ్రైవర్, కుకింగ్ ఇలా ఇంట్లో మనిషిలా కలిసిపోయి అన్ని పనులు చేస్తూ గడిపాడు. జీతం గురించి ఆశించకుండా అంకితభావంతో పని చేశాడు. శ్రీరంగనాథ రేణిగుంట ఐటీఐ కాలేజీలో చదివిన అతనికి బయటికెళ్తే బోలెడు అవకాశాలు కానీ ఆ దిశగా ప్రయత్నం చేయనంత అభిమానం పవన్ కళ్యాణ్ అంటే. అతని ఆశయం నెరవేరేలా పవన్ కళ్యాణ్ ను మాత్రమే కాకుండా కొణిదెల సోదరులందరిని కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తన తండ్రే పెట్రోల్ పోసి తల్లిని రాయుడు చిన్నతనంలో చంపేస్తే, రాయుడు మేనమామ, అమ్మమ్మలే అన్నీ తామై శ్రీనివాసులు సహా తన సోదరి కీర్తిని పెంచి పెద్ద చేశారు. ఆ అమ్మాయికి పెళ్లి కూడా చేశారు. ఆమె భర్త తిరుపతిలో ఓ సాధారణ ఆటో డ్రైవర్. వినుత అక్క అని, తోబుట్టువు కీర్తి తన చెల్లి అని అందరికీ చెప్పుకునేవాడు. రాఖీ పండుగ వచ్చినా ముందు వినుతతోనే రాఖీ కట్టించుకుని తర్వాత కీర్తితో కట్టించుకునేంతటి ఆప్యాయానురాగాలు రాయుడు పెంచుకుంటూ పెరిగాడు. అది మరింత పెరిగి తన చేతిపై జనసేన చిహ్నంతో పాటు వినూత అక్క అని కూడా పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. చివరికి ఆ పచ్చబొట్టు ఆధారం వల్లే తన శవాన్ని పోలీసులు గుర్తించారు.
టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తో ఆధిపత్య పోరు వల్ల ఎమ్మెల్యే జనసేన వీరమహిళ వినుతకు స్పైగా శ్రీనివాసులును ఉపయోగించుకుని వారి వ్యక్తిగత వీడియోలను తన ప్రత్యర్థులకు చేరవేశాడనే అనుమానంతో శ్రీనివాసులును చంపినట్లు ఎఫ్ఐఆర్ లో నిందితులు అంగీకరించారు. రాయుడు మరణం గురించి కాసేపు పక్కన పెడితే ..హత్య అనంతరం ఆ కుటుంబానికి జరిగిన అన్యాయంపై పవన్ కళ్యాణే న్యాయం చేయాలని రాయుడు కుటుంబం కోరుతోంది. చనిపోయిన జనసేన కార్యకర్త రాయుడు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత జనసేన పార్టీపై ఉన్నప్పటికీ కనీస స్పందన ఇంతవరకూ లేదు. రాయుడు కుటుంబాన్ని ఆదుకోవడంపై ఎటువంటి ప్రకటనా జనసేన కార్యాలయం నుంచి రాలేదు.నిజంగా ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు నలిగిపోయిన చందంగా రాయుడు ఇలా దుర్మరణం చెందడం విపరీతమైన అభిమానం పెంచుకునే నేటి యువతకు ఓ గుణపాఠం.
ఈ మొత్తం వ్యవహారంలో రాయుడు వంటి యువతను ఆందోళన కలిగించే అంశం. దేశంలో ఎక్కడెక్కడో ఏ చిన్న అమానుష, అవాంఛనీయ సంఘటన జరిగినా స్పందించే పవన్ కళ్యాణ్ దీనిపై ఏ ప్రకటన చేయకపోవడానికి కారణాలేంటి? అతని కోసమే అభిమానంతో పని చేసిన యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలని రాయుడు కుటుంబం సహా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కోరుతున్నారు. రాజకీయనాయకులు, రాజకీయ పార్టీలకు భిన్నం అనేలా చనిపోయిన రాయుడు చెల్లి కీర్తి కోరిన విధంగా స్పందించి సాయం చేయాల్సిన బాధ్యతను నెరవేరుస్తారా? మౌనం పాటిస్తారా?