అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం
- పేదలకు దూరమవుతున్న ఆధునిక వైద్య సేవలు
నిమ్స్ ‘ముఖ్యుడి' నిర్లక్ష్యంతో గాడితప్పిన పాలన కేసులు, అవినీతి ఆరోపణలు, అంతర్గత కలహాలు అల్లకల్లోలం అయినా పట్టని పాలకులు, ప్రభుత్వ పెద్దలు
By. V. Krishna kuamr
Tpn: స్పెషల్ డెస్క్..
ఎన్టీఆర్ హయాంలో రూపుదిద్దుకుని. డాక్టర్ కాకర్ల సుబ్బారావు నేతృత్వంలో అంతకంతకు ఎదిగి.. పేదల పాలిట వైద్య వరప్రదాయినిగా నిలిచి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా.. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన ప్రజలకు విశిష్ట వైద్య సేవలందించి దశాబ్దాలుగా ఎంతో మందికి ప్రాణం పోసి, పోస్తున్న నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ప్రతిష్ఠ రోజురోజుకు భ్రష్టు పట్టిపోతోంది. నిమ్స్ అంటే పేదలకు అత్యాధు నిక వైద్యం లభించే ఆధునిక దేవాలయం అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నాటుకుపోయింది. గుండె, కిడ్నీ, ఆర్టో, కేన్సర్, లివర్ తదితర సంబంధిత వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో అందించే నిమ్స్ కు ఇప్పుడు అవినీతి జబ్బు చేసింది. కొందరు పెద్దలు తమ స్వార్థం కోసం, మరికొందరు తమ అక్రమ సంపాదన కోసం, కొందరు తమ పదవులు నిలబెట్టుకుంనేందుకు నిమ్స్ ఆసుపత్రిని వాడుకుంటూ వ్యవస్థలను చెడగొడుతున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగి స్తున్నారు. తమకు తామే నిబంధనలు, పద్ధతులు మార్చుకొని అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. ఆసుపత్రికి ఒక పెద్ద దిక్కుగా నిలవాల్సిన అధికారులు కొందరు అక్రమార్కుల చేతిలో కీలు బొమ్మలాగ మారి ఆసుపత్రి ఆర్థిక మూలాలను దెబ్బకొడుతున్నారు.ని
బంధనలకు తూట్లు. వసూళ్లకు తెగబడుతూ...
నిమ్స్ చరిత్రలో లేనివిధంగా టెండర్ నిబంధనల్లో మార్పులు, ఉద్యోగ నియామకాల్లో నిబంధనలు, ప్రమోషన్ల నిబంధనలో తమకు నచ్చినట్టు, తమకు అనుకూలంగా మార్చుకుంటూ నిమ్స్ పరిపాలన వ్యవస్థని సైతం భ్రష్టు పట్టించారు. ఈ ప్రభావం రోగుల వైద్య సేవలపై పడింది. దీంతో నిమ్స్ అత్యవసర విభాగంలో పడకలు అమ్ముకునే స్థాయికి పరిస్థితులు దిగజారాయి. ఏకంగా కొందరు అధికారులు బ్రోకర్లను నియమించుకుని ఎమర్జెన్సీ విభాగంలో బెడ్ కావాలంటే రూ.10 నుండి 20 వేలు వసూలు చేస్తున్నారు. కొన ఊపిరితోవచ్చిన రోగులు కూడా బెడ్ కోసం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది అంటే ఏ స్థాయిలో నిమ్స్ దిగజారి పోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితులు చూసి ఎంతో మంది సేవా దృక్పథంతో పనిచేస్తున్న ప్రముఖ వైద్యులు సైతం తల్లడిల్లిపో తున్నారు. ఏం చేయాలో పాలుపోక మిన్నకుండి పోతున్నారు. ఇంత జరుగుతున్నానిమ్స్ పాలనా పీఠంపై కూర్చున్న పెద్దలకు మాత్రం ఇది అర్థంకాకపోవడం విడ్డూరం.
నిమ్స్ ను వీడిన సీనియర్ వైద్యులు.....
నిమ్స్ నెలకొన్న అవినీతి అక్రమాలు ఆధి పత్యపోరు. ఆధ్వాన పరిస్థితి చూసి తట్టుకోలేక ఎంతో మంది ప్రముఖ సీనియర్ వైద్యులు నిమ్స వదిలి వెళ్లిపోయారు. ముఖ్యమైన కార్డియాలజీ, న్యూరో, నెఫ్రాలజీ, జనరల్ వైద్య సేవలు అందించే ప్రముఖులు చాలా మంది నిమ్స్ ను వదిలి వేరే ఆస్పత్రుల్లో చేరిపోయారు. ఎంతో ప్రతిభ, గుర్తింపు కలిగి కార్పొరేట్ ఆస్పత్రుల ఆఫర్లను సైతం పక్కన పెట్టి నిమ్స్ లో ఉద్యోగాలు చేసే వారు. కానీ ఇప్పుడు ఓ అధికారి స్వలాభం కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప నిమ్స్ అభివృద్ధి గూర్చి ఆలోచన చేయక పోవడం గమనార్హం అతని నిర్లక్ష్యం, ఆహంకారం కారణంగానే నిమ్స్ పరిస్థితి దిగజారుతోందని బయటకు చెప్పుకోలేని వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు. ఇద్దరు అధికారుల మధ్య ఉన్న బేదాభిప్రాయాలను ఒక సంస్థ పెద్దగా పరిష్కరించి, ఇద్దరిని మందలించి సంస్థ బాగు కోసం వారి నుండి పని చేయించుకోవాల్సింది పోయి, వారి మధ్య మరింత వైరం పెరిగేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తన పదవిని నిలబెట్టుకోవడం కోసం ఇద్దరి తప్పులను భరిస్తూ నిమ్స్ పరువును రోడ్డున పడేస్తున్నారు. దీనికి తోడు తన ప్రాంతానికి చెందిన వారిని మాత్రమే కీలక పోస్టుల్లో నియమించి, దశబ్దాల కాలంగా నిమ్స్ కి సేవలందిస్తున్న కొందరు అధికారుల హక్కులు కాల రాసి, వారి పోస్టులకు ఉన్న అధికారాలను తొలగించి వారిని నిస్సహాయులుగా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా జరిగినందునే చాలా మంది ప్రముఖ వైద్యులు నిమ్స్ ను వీడారని చెబుతున్నారు.
నిరుపేదలకు వైద్య సేవలందించాలనే తపనతో ఇక్కడ పనిచేసిన ప్రముఖ వైద్యులు ఇప్పుడు నిమ్స్ కి రాజీనామా చేసి ఇతర కార్పొరేట్ అస్పతుల్లో చేరిపోయారు. ఇంత జరుగుతున్నా నిమ్స్ 'ముఖ్యడు' మాత్రం కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ఏ వైద్యుడిని వదలి వెళ్లొద్దని చెప్పలేదు. వారికి భరోసా ఇవ్వలేదు. ఆయన తన స్వలాభం కోసం అక్రమార్కులకు కొమ్ము కాస్తూ తన స్థాయిని దిగజార్చుకోవడం బాధాకరం.
భాధ్యతలు మర్చిన 'ముఖ్యుడు"...
నిమ్స్ దాని ప్రతిష్టను కాపాడాల్సిన 'పెద్ద' అవినీతిలో
ఆరితేరి పోయారని అంటున్నారు. పైకి "నిజాయతీ పరుణ్ణి' అని ఒక ముసుగు వేసుకుని, పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి, అతి పెద్ద బాధ్య తలు నిర్వహిస్తున్న 'ముఖ్యుడు'పై వరుస కేసులు నమోదవుతున్నా, అతను చేసే అక్రమాలు, అన్యాయాల గూర్చి తెలిసినా ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అవినీతి పరుడైన ఆ అధికారికి ఎందుకు అండగా ఉంటున్నారని అంటున్నారు. పరోక్షంగా అతని అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఏకంగా సిబ్బందే గుసగుసలాడుకుంటున్నా మార్పు ఎందుకు రావడం లేదు అనే అంతుబట్టని విషయంగా మిగిలింది. తాజాగా ఓ పెద్ద అధికారిపై కేసు నమోదై మీడియాలో రచ్చరచ్చ జరిగి.. నిమ్స్ పరువు బజారున పడినా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం సబబు కాదని అంటున్నారు.
తీసినట్లే తీసి.. మళ్లీ ప్రైవేట్ సైన్యానికి పెద్దపీట
ఇక నిమ్స్ ముఖ్యడు తన పసులు చక్కబెట్టుకోవడం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రిటైర్డ్ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు. వారికి రూ. లక్షల్లో జీతాలు చెల్లించాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వారిని తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించారు. కానీ మళ్లీ కొద్దిరోజులకు ఓ ఇద్దరిని నియమించుకున్నాడు. వారికి లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారు. నిమ్స్ కి లక్షల్లో ఆదాయం సమకూర్చే మెడికల్ షాప్ల వద్ద అడ్వాన్స్ తీసుకోవడం లేదట. అలాగే అద్దెలు చెల్లించని వారిపై చర్యలు కూడా ఉందడం లేదని ఆరోపణలున్నాయి. ఇక ప్రతి అంశాన్ని 'మంత్రి' గారికి ముడి పెట్టి పెట్టి తప్పించుకోవడంలో ఆయన దిట్ట అని తెలిసింది.
ప్రభుత్వం స్పందించాల్సిందే...
పేదల వైద్యప్రదాయినిగా పేరొంది. ఎంతో మందికి నమ్మకం కలిగిస్తున్న నిమ్స్ పరిస్థితి మరింత దిగజారకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతా ధికారులు స్పందించి నిమ్స్ అవినీతి అక్రమాలను అడ్డుకోవాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిమ్స్ అంటే పేదల ఆస్పత్రి అనే భరోసా నిలబెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు చొరవ చూపాలంటున్నారు.