ఎవరికి కావలసిన వారు..వారికి..! మహాభారతంలో దుర్యోధనుడి డైలాగ్‌లా పాలన..!
అప్పుడు గోల గోల చేసి ..ఇపుడు అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేసి..!
సలహాదారులు..కన్సల్టెంట్లతో నింపుతున్న కూటమి ప్రభుత్వం
మహాభారతం.. కురుక్షేత్ర యుద్ధం సమయంలో దుర్యోధనుడి పాత్ర అన్న డైలాగ్ కు అద్దం పట్టేలా ఉన్నాయ్ ఏపీలో రాజకీయాలు.పరిపాలన. మారేవి ప్రభుత్వాలు, మనుషులు మాత్రమే ప్రజల బతుకులు, వాళ్ల వసతులు కాదని. గత ప్రభుత్వంలో సలహాదారుల నియామకంపై రచ్చరచ్చ చేసిన నాటి ప్రతిపక్షనాయకులు నేడు పాలనలోకి వచ్చేసరికి పూర్తిగా మునుపటి ప్రభుత్వ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. వాళ్లలా ఎవరికి పడితే వారికివ్వలేదని కూటమి ప్రభుత్వం సర్దిచెప్పుకున్నా..ఎవరివాళ్లు వారికి తప్ప సామాన్యులకి,ప్రజలకు సలహాదారుల సేవలతో ఒరిగేదేంటనేది సగటు మనిషికి తలెత్తే ప్రశ్న.
రిటైర్డ్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు తమకు కావల్సిన సలహాదారులుగా నియమించి ఖజానా నుంచి భారీ ఎత్తున వేతనాలివ్వడం వల్ల సామాన్యులకు జరుగుతున్న మేలేంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పీ4 పథకం అమలుకు సంబంధించి 175 అసెంబ్లీ నియోజకవర్గ విజన్ యూనిట్లలో యువ నిపుణులను నెలకు రూ.60వేలు చొప్పున ఏడాదికి రూ.12.60 కోట్ల వంతున నాలుగేళ్లలో ఏకంగా రూ.40.40 కోట్లు రాష్ట్ర డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైడీ గ్రాండ్ ఇన్ ఎయిడ్ నుంచి ప్రభుత్వం చెల్లించేలా ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకూ అధికారికంగా సలహాదారులుగా నియమించబడిన వారి మొత్తం 28 మంది.
175 నియోజకవర్గ స్వర్ణాంధ్ర యూనిట్లలో ఒక్కో చోట ఐదుగురు చొప్పున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించినప్పటికీ యువ నిపుణుల పేరుతో 175 మంది ప్రైవేట్ వ్యక్తులను అదనంగా నియమించడం అధికార దుర్వినియోగం ఎందుకుకాదు? ఇక వికసిత ఆంధ్రా విజన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీలో 71 పోస్టుల్లో కన్సల్టెంట్లను నియమించి నెలకు రూ.లక్షల్లో వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. మరోపక్క ఆదాయం పెంచేందుకంటూ రాష్ట్ర ఆర్థిక శాఖలో 11 మంది కన్సల్టెంట్లను 8 నెలల కోసం రూ.3.28 కోట్లు చెల్లిస్తూ నియమించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డుకు (ఈడీబీ..పరిశ్రమల శాఖలో భాగం) కేపీఎంజీ నుంచి ఆరుగురు కన్సల్టెంట్ల సేవలందించేందుకు రూ.3,66,91,639 చెల్లిస్తున్నారు.
అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కన్సల్టెంట్ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.11.44 కోట్లకు సీఆర్‌డీఏ అప్పగించింది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పర్యవేక్షణకు వివిధ రంగాలకు చెందిన కన్సల్టెంట్లను నియమిస్తోంది. ఇందుకోసం రెండేళ్లకు రూ.22.58 కోట్లు చెల్లించనున్నారు. జోన్ 7 పనులను పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీకి రూ.10.60 కోట్లు చెల్లించనున్నారు.
ఫోరెన్సిక్ సలహాదారుగా కేపీసీ గాంధీ, భారత్ బయోటెక్ ఎండీగా ఉన్నా సుచిత్రా ఎల్లా, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్,రక్షణ రంగ నిపుణుడు సతీష్ రెడ్డి, ఏపీ అటవీశాఖ సలహాదారుగా ఫారెస్ట్ మ్యాన్, జర్నలిస్టు అంకారావు లాంటి వారు ఏపీకి సాయం చేయాలంటే సలహాదారులు, కేబినెట్ ర్యాంకులు అడగరు. చెరుకూరి కుటుంబరావును స్వర్ణాంధ్ర పీ 4 వైస్ చైర్మన్‌గా, ఏపీ ఎన్నార్టీఎస్ సలహాదారుగా వేమూరి రవికుమార్ వంటి వారిని ముందుగా నియమిస్తే విమర్శలు వస్తాయని ముందు సంబంధంలేని రంగాల నిపుణులను ఆ తర్వాత తమవారిని నియమించాలనే వ్యూహం కూడా కావచ్చు.వీరి సలహాలను ప్రభుత్వం ప్రణాళికతో ఎంతమేర వినియోగించుకుని ప్రజలకు ఏ రకంగా మేలు చేస్తుందో అనేదే కీలకమైన విషయం.
సీఆర్డీఏలో కన్సల్టెంట్ల రాజ్యం సాగుతోంది. గత టీడీపీ హయాంలోలాగే కూటమి ప్రభుత్వంలోనూ అమరావతి కన్సల్టెంట్ల పేరుతో రూ.వందల కోట్లు వ్యయం జరుగుతోంది. ఈ దఫా సీఆర్డీఏలో నియమించిన కన్సల్టెంట్ల వ్యయం ఇప్పటికే రూ.150 కోట్లు దాటగా..తాజాగా, అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రాజెక్టు మేనేజ్ మెంట్ కన్సల్టన్సీగా కొలియర్స్ ఇంటర్నేషనల్ (ఇండియా) ప్రాపర్టీ సర్వీసెస్ ను ఖరారు చేసింది. ఇప్పటికే జోన్ 2,4,6,10, 12, 12ఏ పనులకోసం రూ.100 కోట్లు పైన పనులను ఖర్చుపెడుతూ కన్సల్టెన్సీలకు కట్టబెట్టింది. ఇక అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాల కోసం జోన్ 7లో పర్యవేక్షణకు మరో ప్రాజెక్టు మేనేజ్ మెంట్ కన్సల్టన్సీని ఆహ్వానించింది.