అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0..! ఇళ్ల వద్ద నుంచే రిజిస్టర్ పోస్టు బుకింగ్ సేవలు!
వినియోగదారుల సౌకర్యార్థం పోస్టల్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ పోస్టు బుకింగ్ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ సేవలను ప్రజలకు చేరువ చేయడంకోసం అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0లో భాగంగా ప్రత్యక యాప్‌ను ప్రవేశపెట్టనున్నారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని సేవల కోసం సిబ్బందికి రిక్వెస్టు పంపితే.. ఆ మేరకు సేవలందించేలా చర్యలు తీసుకుంటారు.
ఇప్పటి వరకూ స్పీడ్ పోస్టు , రిజిస్టర్ పోస్టులాంటివి చేయాలంటే కచ్చితంగా పోస్టాఫీసులకు వెళ్లాల్సి ఉండేది. అయితే జూలై 22 నుంచి ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ పోస్టు బుకింగ్ సేవలు అందించనుంది. ఆ రోజు నుంచి పోస్టాఫీసు సిబ్బందే వినియోగదారుల ఇళ్ల వద్దకు వెళ్లి.. రిజిస్టర్ పోస్టులు స్వీకరించనున్నారు. ఇందుకోసం తపాలా శాఖ కసరత్తు జరుపుతోంది.
విలువైన ఆర్టికల్స్‌ను రిజిస్టర్, స్పీడ్ పోస్టులో పంపాలనుకునే వారు వాట్సప్ ద్వారా తపాలా శాఖకు సమాచారమివ్వాలి. ఆ వెంటనే వినియోగదారుడి ఫోన్‌కు బార్‌కోడ్ నంబరుతో పాటు ఓటీపీ పంపుతారు. తరువాత ఇంటికి వచ్చే సిబ్బందితో బార్‌కోడ్, ఓటీపీ వివరాలు సరిచూసుకొని ఆర్టికల్స్ వారికిస్తే సరిపోతుంది. దీనికి సేవా రుసుము ఉండదు. రూ.500కు పైగా విలువ ఉన్న వాటికి మాత్రం నిర్దేశించిన రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0లో భాగంగా క్లౌడ్ టెక్నాలజీకి ప్రస్తుత డేటాను అనుసంధానించడానికి ఈ నెల 21న నో ట్రాన్సాక్షన్ డేగా ప్రకటించారని తపాలా శాఖ ఏలూరు ఎస్పీ శ్రీకర్‌బాబు స్పష్టం చేశారు.