అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9కి చేరిన మృతుల సంఖ్య!
అన్నమయ్య జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రమాదంలో ఐదు మంది మహిళలు, నలుగురు పురుషులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నేడు తొమ్మిది మంది మృతదేహాలకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతులు అందరూ రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట ఎస్టీ కాలనీ చెందిన వారిగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ.. ఆదివారం రాత్రి పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు చిన్న పిల్లలతో కలిపి లారీలో 21 మంది కూలీలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మరో తొమ్మిది మందిని రక్షించారు.
ఈ రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ‘లారీ బోల్తా పడి 9 మంది మృతి చెందడం బాధాకరం. మామిడికాయలు కోసే కూలీల మరణ వార్త దిగ్బ్రాంతికి గురి చేసింది. కూలీల కుటుంబాలకు వారి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.