అమరావతికి మైక్రోసాఫ్ట్‌..!

By TVK
On
అమరావతికి మైక్రోసాఫ్ట్‌..!

  • క్వాంటమ్ వ్యాలీకి మరో దిగ్గజ సంస్థ
  • రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ సిద్ధం
  • సంస్థ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు
  • త్వరలో మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం 

అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రముఖ దిగ్గజ సంస్థలు ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌అండ్‌ టీ కలిసి దేశ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్‌ కంప్యూటర్‌ను రూపొందించనున్నాయి.  అమరావతిలో ఏర్పాటయ్యే ఈ క్వాంటమ్ వ్యాలీ ఓ గేమ్‌ చేంజర్‌ అని ఐటీ రంగ నిపుణులు అంటున్నారు. క్వాంటమ్‌ సిస్టమ్‌-2గా భావిస్తున్న ఇది 156 క్యూబిట్ల సామర్థ్యం ఉండే హెరాన్‌ ప్రాసెసర్‌ ద్వారా పనిచేస్తుంది. ప్రస్తుతానికి క్వాంటమ్‌ టెక్నాలజీనీ అమెరికా, చైనా, ఫ్రాన్స్‌, కెనడా, ఫిన్లాండ్‌ లాంటి కొన్ని దేశాలు మాత్రమే ఉపయోగిస్తున్నాయి. ఈ టెక్నాలజీలో భారత్ అద్భుతాలను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకరంతో నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌లో భాగంగా అమరావతిలో 2026 జనవరి 1 నాటికి క్వాంటమ్‌ వ్యాలీ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇందులో కంప్యూటర్‌ నిర్మాణంతోపాటు, డేటా సెంటర్లు, రిసెర్చ్‌ ఇంక్యుబేటర్లు, టెక్‌ పార్కులను నిర్మిస్తారు. 

మరోవైపు ఇదే క్వాంటమ్ వ్యాలీలో ప్రముఖ టెక్నాలజీ ఐకాన్ మైక్రోసాఫ్ట్ కూడా భాగస్వామ్యం అవుతోంది. ఈ మేరకు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధిం రాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ అధికారులతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. త్వరలోనే ఏపీ ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ సంస్థ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఎంవోయూ కుదుర్చుకోనుంది.  క్వాంటమ్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ భవనాన్ని ఏర్పాటు చేయబోతోంది. క్వాంటమ్‌ టెక్నాలజీని మరింత విస్తృతంగా వినియోగించేందుకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్.. అమరావతిలో తమ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అమెరికాలోని తమ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే క్వాంటమ్‌ కంప్యూటర్‌ను ఏర్పాటు చేసుకున్న మైక్రోసాఫ్ట్‌ సంస్థ.. దాన్ని మరింత విస్తృతపరిచేందుకు సిద్ధమైంది. ఏపీ ప్రభుత్వం క్వాంటమ్‌ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో రీసెర్చ్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. 

Advertisement

Latest News