'కడప ఉక్కు' హామీ ఏమైంది? మహానాడులో ఇచ్చిన మాట తప్పినట్లేనా!
కడప ఉక్కు పరిశ్రమ పనులు చేపడతామని గత టీడీపీ మహానాడు సందర్భంగా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దదండ్లూరు-సున్నపురాళ్లపల్లి సమీపంలో మరో 10 రోజుల్లో ప్రారంభిస్తామని చివరి రోజైన 29న చంద్రబాబు నాయుడు సభలో హామీనిచ్చారు. జూన్ 12న ఉక్కు పరిశ్రమ పనులు చేపడతామని స్పష్టంగా చెప్పారు. ఇదే విషయాన్ని మీడియా చిట్ చాట్ లో ఆయన కుమారుడు ప్రస్తుత ఐటీ మంత్రి లోకేశ్ సైతం ప్రస్తావించారు. అయితే తండ్రీకొడుకులు ఇచ్చిన గడువు ముగిసి నెల రోజులు కావస్తోన్న ఉక్కు నిర్మాణ పనుల్లో ఏ కదలికా లేదు.
కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీ అమలులో అంతులేని నిర్లక్ష్యం కనపడుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ వీలు పడదని పేరుతో కాలయాపన చేస్తూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుందనే హామీతో 2018 ఫిబ్రవరిలో జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదిన్నెలో అప్పటి సీఎంగా ఉన్న నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి ; వైసీపీ బాటలోనే విజయ్.. జగన్ డైలాగ్ రిపీట్ చేసిన టీవీకే చీఫ్ !
ఆ తర్వాత అదే నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి సమీపంలో 3,200 ఎ్కాల్లో వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ అప్పటి వైసీపీ సర్కార్ మరోసారి శంకుస్థాపన చేసింది. ఉక్కు దిగ్గజ కంపెనీల్లో ఒకటైన జెఎస్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో రూ.15వేల కోట్ల వ్యయంతో ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ హయాంలో చేపట్టిన రూ.500 కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన మౌలిక వసతుల నిర్మాణ పనుల్లో భాగమైన 7.5 కిలోమీటర్ల రహదారి పనులకుగానూ 6.5 కిలోమీటర్ల మేర పూర్తి చేసిన రహదారి పనులకు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, నీటి సంపుల నిర్మాణం, రైల్వే లైన్, రూ.150 కోట్లతో బ్రహ్మసాగర్ రిజర్వాయర్ నుంచి చేపట్టిన నీటి సరఫరా పైప్ లైన్ పనులు, ఎస్ఎస్ ట్యాంకుల నిర్మాణ పనుల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.పెండింగ్ బకాయిలను క్లియర్ చేసి పనులు ప్రారంభించడంలో రాజకీయ చిత్తశుద్ధి లోపించింది. కడప ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనలు, హామీలకు పరిమితమవుతుందా? ఈ ప్రభుత్వం మహానాడు సందర్భంగా ఇచ్చిన మాట తప్పుతుందా? పూర్తి చేస్తుందా? వేచి చూడాలి.