పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో సగటు భారతీయుడి ఆవేదన!

By PC RAO
On
పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో సగటు భారతీయుడి ఆవేదన!

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK). 13వేల కిలోమీటర్ల వైశాల్యం ఉన్న భూభాగం. ఆ ప్రాంతమంతా ఎక్కువ భాగం కొండలు, పర్వతాలే. 40 లక్షల పైచిలుకు జనాభా. అంతా ముస్లింలే. ఒకప్పుడు కశ్మీర్‌లో భాగంగా ఉండేది. అఖండ భారత్‌లో అంతర్భాగమనేది మన వాదన. అదే నిజం కూడా. కానీ, ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా ఉంది. అలాగని అదేమీ పాకిస్తాన్‌కు చెందింది కాదు. కానీ, పాక్ కంట్రోల్‌లోనే ఉన్న ప్రాంతం. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి పీవోకే చుట్టూ.

దేశ విభజన జరిగిన తర్వాత.. కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. జమ్మూ కశ్మీర్‌పై కన్నుపడిన పాకిస్తాన్.. గిరిజనులను కశ్మీర్ రాజు హరిసింగ్ మీదకు ఉసిగొల్పింది. గిరిజనుల ముసుగులో పాక్ సైన్యం తిరుగబాటుకు ప్రాతినిధ్యం వహించింది. ఆ దాడిని ఎదుర్కోలేని రాజా హరిసింగ్.. అప్పటి భారత ప్రభుత్వం సాయం కోరారు. కశ్మీర్‌ను ఇండియాలో విలీనం చేస్తేనే సహాయం చేయగలమని భారత ప్రభుత్వం తెలిపింది. అలా 1947 అక్టోబర్ 26న కశ్మీర్ భారతదేశంలో విలీనమైంది.

1949లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా.. అప్పటికే కశ్మీర్‌లోని కొంత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాకిస్తాన్ తిరిగి వెనక్కి వెళ్లలేదు. ఆ ప్రాంతమే పీవోకే.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌గా మిగిలిపోయింది. అది ఇండియాదే అనేది భారత ప్రభుత్వ వాదన. 1971లో మరోసారి ఇండో పాక్ యుద్ధం జరిగింది. 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం కశ్మీర్ సమస్యతో సహా ద్వైపాక్షికంగా వివాదాలను పరిష్కరించడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. కానీ, పీవోకే పై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.

అటు, చైనా సైతం పీవోకే లో మెళ్లిమెళ్లిగా చొరబడింది. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC) రూపంలో PoKలో చైనా పెట్టుబడులు పెడుతోంది. ఇండియా ఆ ప్రాంతంలో ఎంటర్ అయితే.. పాక్‌కు సపోర్ట్‌గా చైనా జోక్యం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. అది మరో సమస్యకు తెరలేపుతుంది. అలాగని వదిలేయలేం. పీవోకే కేంద్రంగానే పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులను నడుపుతుండటం ఆందోళన కలిగించే అంశం. 

 యుద్ధం వల్ల కలిగే ఆర్థిక, ప్రాణ నష్టాలను దృష్టిలో పెట్టుకొని.. పీవోకే ను అంతగా పట్టించుకోవట్లేదనే చెప్పాలి. ఆ ప్రాంతంపై నేరుగా దాడి చేయడం తరహా చర్యల కంటే కూడా.. అవసరమైన సమయాల్లో.. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ వైమానిక దాడుల వంటి పరిమిత సైనిక చర్యలనే ఎంచుకుంది ఇండియా. 

కానీ ఏప్రిల్ 22, 2025, జమ్ముకశ్మీర్ పహల్గాంలోని బైసరన్ లోయలో భారత పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ నేపాలీ సహా 26మంది చనిపోయారు.మరో 46మంది గాయపడ్డారు. కాల్పుల్లో చనిపోయిన వారిలో తెలుగువారు విశాఖకు చెందిన చంద్రమౌళి, నెల్లూరుకు చెందిన మధుసూదనరావు ఉన్నారు. ఈ దాడితో భారత్‌లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. పహల్గాన్ ఘటన పీవోకేను తిరిగి భారత్‌ సొంతం చేసుకోవడానికి  ఒక అద్భుత అవకాశంగా ప్రతి భారతీయుడు భావించాడు.

పహల్గాం దాడికి ప్రతిగా.. ఎలాంటి దాడులైనా చేసేందుకు త్రివిధ దళాలకు భారత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని.. ఎక్కడ (టార్గెట్‌), ఎప్పుడు (టైమింగ్‌), ఎలా (మోడ్‌) చేయాలో నిర్ణయించే అధికారం కూడా వారిదేనన్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలతో మే 7న అర్ధరాత్రి 1.05గం.లకు పాకిస్తాన్‌పై భారత్  ఆపరేషన్ సిందూర్ పేరుతో క్షిపణి దాడులు చేసింది. కానీ, పాకిస్తాన్ పై చర్యలను మధ్యలోనే వదిలేయడం కోట్లాది మంది భారతీయులను  ఉసూరుమనిపించింది. ఇలాంటి సందర్భం అవకాశం భారత్‌కు మళ్లీ రాదని పీవోకేని క్లీన్ స్వీప్ చేసి తిరిగి కశ్మీర్ భారత్‌దేనని యావత్ ప్రపంచానికి చాటే అరుదైన అవకాశాన్ని మిస్ చేసుకుందా? అని సగటు భారతీయుడు సహా విపక్షాలు సైతం ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ విదేశీ విధానంపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతూ విమర్శిస్తున్నారు.

Advertisement

Latest News