వారాహి ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ భక్తులకు వినూత్న కానుక..
గుప్త నవరాత్రుల పూర్ణాహుతివేళ పురాణపండ ' శ్రీమాలిక ' మహాద్భుతం !
రాష్ట్రం కోసం ఈ మహాసంకల్పాన్ని అభినందించిన శీనానాయక్
భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన సర్వశక్తిమంతమైన అపురూప అద్భుత అంశాలతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా అందించిన ' శ్రీమాలిక ' మహాగ్రంధంలో వేదాది విద్యల బలాలు నిండి ఉండటం ప్రశంసనీయమని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ మరియు ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఆషాడ గుప్త నవరాత్రోత్సవాల పూర్ణాహుతి సందర్భంగా దేవస్థానంలో వారాహి ఉత్సవాల చివరిరోజైన శుక్రవారం ఉదయం ఆయన శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ మంగళరచనా వైభవం శ్రీమాలిక గ్రంధాన్ని అమ్మవారి సన్నిధిలో ఆవిష్కరించారు .
ఈ సందర్భంగా శీనానాయక్ మాట్లాడుతూ... అనుష్టానబలం నిండిన మంత్ర విద్యల , స్తోత్ర విద్యల నాలుగు వందల పేజీల ఈ శ్రీమాలిక అమృత కలశాన్ని సుమారు ఐదువేల ప్రతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల సంయుక్త సారధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ సుసంపన్నంగా అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ దుర్గమ్మ శ్రీచరణాలకు దేవస్థానంలో సమర్పించిన జనసేన శ్రేణుల్ని అభినందించారు.
దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రోత్సాహంతో ఈ శ్రీమాలిక మహాగ్రంధాన్ని దర్శనానికి విచ్చేసిన దాతలకు , ఉన్నతాధికారులకు, న్యాయమూర్తులకు, రాజకీయ ప్రముఖులకు, సినీ ప్రముఖులకు ఉచితంగా బహూకరించనున్నట్లు ఆలయవర్గాలు స్పష్టం చేశాయి. దేవస్థాన చరిత్రలో ఇలా నాల్గు వందల పేజీల మహాద్భుత మంగళ గ్రంధాన్ని అమ్మవారి అనుగ్రహంగా పంచిపెట్టడం దేవస్థాన చరిత్రలో మొదటిసారికావడంతో దేవస్థానం అర్చక బృందాలు ఆశ్చర్యంతోపాటు హర్షాన్ని ప్రకటిస్తున్నాయి.
ఈ అంశంలో సహకరించిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కిమ్స్ హాస్పటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి , మంత్రి నాదెండ్ల మనోహర్ కు జనసేన శ్రేణులు కృతజ్ఞతలు తెలిపాయి.
దేవదాయశాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి , దేవాదాయశాఖ కమీషనర్ కే.రామచంద్రమోహన్ ల ప్రోత్సాహంతో అతి అరుదైన అమ్మవార్ల వంద చిత్రాలతో పరమశోభాయమానంగా ' మంగళ ' ప్రత్యేక గ్రంధాన్ని శ్రావణమాసపు దేవస్థాన కానుకగా భక్తబృందాలకు అందించనున్నట్లు ఆలయవర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా ... శుక్రవారంనుండే శ్రీమాలిక గ్రంథ వితరణను ఆలయ వర్గాలు ప్రారంభించాయి.