అందరి చూపు జూబ్లీహిల్స్ వైపు..
- సమరం కోసం సై అంటున్న పార్టీలు.. పట్టుకోసం టీడీపీ ప్రయత్నాలు..
- జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సిద్ధమైన పలుపార్టీలు..
తెలంగాణలో పట్టుకోసం టీడీపీ విశ్వప్రయత్నాలు..
సుహాసినిని బరిలోకి దింపేందుకు సిద్ధమైన అధిష్టానం..
కమిటీలని ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపికలో బిజీ అయిన కాంగ్రెస్..
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
ఆంధ్రా.. తెలంగాణ పాలిటిక్స్ మొత్తం హైదరాబాద్ వైపు చూస్తున్నాయి.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (maganti gopinath) మరణంతో ఆ స్థానం కైవసం కోసం ఇప్పటి నుండే ఎత్తులు వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్, , బీజేపీ అభ్యర్థుల ఖరారు కోసం కమిటీలను సైతం ఏర్పాటు చేసుకోగా.. తాజాగా తెలంగాణ సమరమే అంటూ టీడీపీ (tdp) కి కూడా రంగంలోకి దిగింది. తెలంగాణలో టీడీపీ తిరిగి బలం పెంచుకోవటం కోసం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఏపీలో కొనసాగుతున్న మూడు పార్టీల కూటమి తెలంగాణలోనూ విస్తరించాలనే ఆలోచన ఉంది. అయితే, స్థానిక బీజేపీ నేతల నుంచి భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల వేళ కూటమి జత కట్టే అవకాశం ఉంది. కాగా, త్వరలో జరిగే జూబ్లీహిల్స్ బై పోల్ లో పోటీ ద్వారా గ్రేటర్ ఎన్నికలు.. భవిష్యత్ రాజకీయాలకు రూట్ క్లియర్ చేసుకొనేలా టీడీపీ సిద్దం అవుతోంది. అభ్యర్ధిపైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ బరిలోకి దిగితే ఎవరికి కలిసి వస్తుంది.. ఎవరికి నష్టం చేస్తుంది..
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా రాజకీయం మొదలు పెట్టాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సర్వేలు చేయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తో జూబ్లీ హిల్స్ బైపోల్ పైన ప్రధాన పార్టీలు చర్చలు.. లెక్కలు మొదలు పెట్టాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అక్టోబర్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబం ధించి సెప్టెంబర్ లో షెడ్యూల్ విడుదల అవుతుందని అంచనా. కంటో న్మెంట్ సీటు తరహాలోనే జూబ్లీహిల్స్ స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఈ స్థానంలో పరిస్థితుల అధ్యయనం.. నిర్ణయాల కోసం పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, వివేక్ తో సీఎం రేవంత్ ఒక కమిటీ ఏర్పాటు చేసారు. 2009 లో ఏర్పాటు అయిన ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ మూడు సార్లు గెలిచారు.
2014 లో టీడీపీ నుంచి గెలవగా, ఆ తరువాత బీఆర్ఎస్ లోకి వెళ్లారు. 2018,2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఖైరతాబాద్ నుంచి విడిపోయి 2009 లో జూబ్లీహిల్స్ నియోజక వర్గం ఏర్పాటు అయింది. 2009 లో పీ విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక, ఇప్పుడు బైపోల్ లో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి, నవీన్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓటింగ్ కీలకం. కాంగ్రెస్ - ఎంఐఎం మధ్య పోటీ పైన అంగీకారం కుదిరితే మొత్తం లెక్కే మారిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచే తమ పార్టీ అభ్యర్దిగా పోటీలో నిలపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సాధ్యం కాకుంటే మాజీ ఎమ్మెల్యే విష్ణుకు సీటు కేటాయించే ఛాన్స్ ఉంది. ఈ సారి అనూహ్యంగా టీడీపీ సైతం ఈ నియోజకవర్గంలో పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ నేతల లెక్కలు భిన్నంగా ఉన్నాయి. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు.. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు. ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీఏను తెలంగా ణలోనూ విస్తరించాలనే ప్రతిపాదన ఉంది. త్వర లో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు జరుగుతున్న ఈ ఎన్నికతోనే పొత్తు ప్రారంభించాలనే ఆలోచన జరుగుతోంది. దీంతో, జూబ్లీహిల్స్ బైపోల్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధిని బరిలో నిలపాలని భావిస్తు న్నారు. అందులో భాగంగా టీడీపీ నుంచి నందమూరి సుహాసిని పేరు పరిశీలనలో ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది.
టీడీపీలో సుహాసిని క్రియాశీలకంగా ఉన్నారు. నందమూరి వారసురాలిగా సీటు ఇస్తే కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ నుంచి ఒక పారిశ్రామిక వేత్తను పోటీలో దింపాలని భావిస్తోంది. ప్రస్తుతం చర్చల స్థాయిలో ఉన్న ఈ ప్రతిపాదనల పైన మూడు పార్టీల అధినాయకత్వం చర్చించి.. తుది నిర్ణయం తీసుకోనుంది. టీడీపీ పోటీపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటే.. గ్రేటర్ కేంద్రంగా తెలంగాణలో కొత్త రాజకీయం మొదలు కానుంది. ప్రస్తుతం తెలంగాణ. ఆంధ్రా ఎన్నికలు ఒక ఎత్తు అయితే జూబ్లీహిల్స్ మరో ఎత్తులా మారింది. ప్రతి పార్టీ దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని విజయదుందుబి మోగించాలని చూస్తున్నాయి. ఊహించని స్థాయిలో డబ్బులు ఖర్చు చేసైనా పట్టుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టాయి.