మంత్రి సీతక్కకు మావోయిస్టుల మరో లేఖ..
ఇటీవల మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ రాశారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ లేఖ విజయంలో తాజాగా మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. మంత్రి సీతక్కపై ఆ ప్రకటన తాము చేయలేదని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమటీ పేరిట జూన్ 26న మంత్రి సీతక్కపై వచ్చిన ప్రకటనకు మావోయిస్టు పార్టీ ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు జగన్ నేడు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మావోయిస్టులపై కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ను తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని.. ఎన్కౌంటర్లు ఆపాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేస్తోందని లేఖలో వెల్లడించారు. అణచివేతల ద్వారా మావోయిస్టు పార్టీని నిర్మూలించడం సరైంది కాదని కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన సంగతి ప్రజలకు తెలిసిందేనని లేఖలో తెలిపారు. తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేకపోయినా పార్టీకి సహకారం అందించే ప్రజల పట్ల కఠినంగా వ్యవరిస్తామని చెబుతోందని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన వారు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అమాయక ఆదివాసీ ప్రజలను పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరింపులకు గురి చేస్తున్నారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల దినపత్రికలు, సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ లొంగపోతున్నట్లు జరుగుతున్నట్లు ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. దామోదర్ లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియా చేసిన ఈ ప్రకటనలో ఎలాంటి నిజం లేదని జగన్ తన లేఖలో వెల్లడించారు. పోలీసులే ఇలాంటి ఉద్దేశపూర్వక దుష్ప్రచారం చేస్తున్నట్లు.. గతంలో కూడా అనేక సార్లు దామోదర్ ఎన్కౌంటర్లలో మరణించినట్లు, లొంగిపోయినట్లు ప్రచారం చేశారని వెల్లడించారు.