అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 20నుంచి ఆర్థిక సాయం: మంత్రి అచ్చెన్నాయుడు
ఏలూరు: రాష్ట్ర రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 20వ తేదీ నుంచి ఆర్థిక సాయం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని వంగూరులో బుధవారం 'ఏరువాక పూర్ణిమ' కార్యక్రమాన్ని మంత్రి నాగలితో పొలం దున్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ, రైతులపై ప్రభుత్వం ఎప్పుడూ వెన్నుతోటి నిలుస్తుందని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నామని, గత ప్రభుత్వం మాటలు చెప్పినప్పటికీ చేతల్లో రైతులకు ఎటువంటి మేలు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిగా ఉన్న రూ.1640 కోట్లను చెల్లించామని గుర్తు చేశారు.
రబీ, ఖరీఫ్ సీజన్లలో ధాన్యం సేకరణ అనంతరం 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడం ద్వారా వ్యవసాయానికే గౌరవం తీసుకురాగలిగామని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంపొందిస్తున్నామన్నారు.
కాకో, మిర్చి, మామిడి పంటలతో పోరాడుతున్న రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకుందని వెల్లడించారు.