మంత్రి సీతక్కకు మావోయిస్టుల షాక్

On
మంత్రి సీతక్కకు మావోయిస్టుల షాక్

తెలంగాణలో మంత్రి సీతక్కకు మావోయిస్టులు షాకిచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆదివాసీలకు ప్రభుత్వం నష్టం చేస్తుంటే సీతక్క ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని వారు మండిపడ్డారు. జీవో 49 పేరుతో ఆదివాసి జిల్లాలను ప్రభుత్వం ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుందని వారు సంచలన ఆరోపణలు చేశారు. ఆదివాసి గిరిజన బిడ్డల హక్కులను ప్రభుత్వం కాల రాస్తుంటే, ఆదివాసి బిడ్డ అయిన మంత్రి సీతక్క ఎందుకు స్పందించలేదని మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ తన లేఖలో ప్రశ్నించారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలను పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అసలు స్పందించడం లేదని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా చట్టం, 1/70 చట్టాలను మంత్రి సీతక్క మరిచిపోయారా అంటూ మావోయిస్టులు తమ లేఖలో ప్రశ్నించారు. మాజీ మావోయిస్టు అయిన సీతక్క ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆదివాసీల హక్కుల కోసం పట్టించుకోవడంలేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు సంబంధించి పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనిని వారు తేల్చి చెప్పారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 339 ఆదివాసి గ్రామాలను, జీవో నెంబర్ 49 ని వాడుకొని ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని వారు ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవో తీసుకువచ్చిందని వారు రేవంత్ రెడ్డి సర్కార్ పైన నిప్పులు చెరిగారు.

Advertisement

Latest News