తల్లిని గెంటేసిన కుమారులు.. ఇంటిని సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు
హైదరాబాద్: తల్లిని గెంటేసిన కుమారుల తీరును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రెండ్రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో రెవెన్యూ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. ఈ ఘటన మలక్పేట మూసారాంబాగ్లో జరిగింది. మూసారాంబాగ్కు చెందిన శకుంతలా బాయి(90)కి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. ఆమె భర్త చాలా ఏళ్ల క్రితమే మృతి చెందారు. అప్పటి నుంచి తన నివాసంలో కొడుకుల వద్ద ఉండేది. కానీ, తల్లి ఆలనాపాలనా చూడాల్సిన ఇద్దరు కుమారులు నిర్లక్ష్యం చేస్తూ బలవంతంగా బయటకు వెళ్లగొట్టారు. దిక్కుతోచని ఆ వృద్ధురాలు సైదాబాద్లోని చిన్న కుమార్తె వద్ద ఉంటోంది.
బాగోగులు చూడని కుమారులు ఇంట్లో ఉండొద్దని, తన ఇల్లు స్వాధీనం చేయాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి శకుంతలాబాయి హైదరాబాద్ జిల్లా ఆర్డీవోను 2024 ఫిబ్రవరిలో ఆశ్రయించింది. ఆర్డీవో ఇద్దరు కుమారులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంటిని తల్లికి అప్పగిస్తామని అంగీకరించారు. కానీ నెలలు గడుస్తున్న ఇంటిని ఖాళీ చేయలేదు. సైదాబాద్ తహశీల్దార్ జయశ్రీ మూడు రోజుల క్రితం బాధితురాలి కుమారులకు ఫైనల్ నోటీస్ జారీ చేశారు. రెండ్రోజుల్లో ఇల్లు ఖాళీ చేయక పోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. గడువు ముగియడంతో సిబ్బందితో తహశీల్దార్ రాగా అప్పటికే కుమారులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. వెంటనే రెవెన్యూ సిబ్బంది ఆ ఇంటిని సీజ్ చేశారు.
.