ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు..

On
ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు..

  • పాతబస్తీలో కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్ల ఆందోళన..
  • విద్యుత్ శాఖ అధికారుల నిర్ణయంపై మండిపాటు..
  • సీఎం స్పందించాలని వినతి..

ఇంత దారుణం ఏ ప్రభుత్వంలో చూడలేదు.. వందల మంది రోడ్డున పడుతున్న.. జనం ఇబ్బంది పడుతున్న కనికరం లేదు.. ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే మాకు శరణ్యం.. అంటూ వందలాది మంది కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు రోడ్డెక్కారు. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట వద్ద ఆందోళనకు దిగారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు తమను తీవ్రంగా కలిచి వేస్తున్నాయని, విద్యుత్ శాఖ అధికారులు చేస్తున్న పని వల్ల లోకల్ ఇంటర్నెట్, కేబుల్ ప్రసారాలు నిలిచిపోయి జనమే కాదు, ప్రభుత్వ శాఖల్లో సేవలకు కూడా అంతరాయం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైర్లు కట్ చేయడం వల్ల ఉన్న ఉపాధిపోయి తమ కుటుంబాలతో సహా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని కంట తడి పెట్టుకున్నారు. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని తమపై వత్తిడి చేస్తున్నారని, వారికి ఎంత నచ్చ చెప్పిన వినడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన అని భావించామని తీరా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే తమ కడుపులు కొట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసినా ప్రయోజనం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే తాము ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకు దిగిన ఆపరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Latest News