Nimisha Priya Case: నిమిషా ప్రియకు ఊరట.. ఉరిశిక్ష వాయిదా
కేరళ నర్సు నిమిషా ప్రియ కేసులో ట్విస్ట్
చివరి నిముషంలో ఉరిశిక్ష వాయిదా
బ్లడ్ మనీ ఒప్పందంపై సర్వత్రా ఉత్కంఠ
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కేరళ నర్సు నిమిషా ప్రియ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యెమెన్ లో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. ఈనెల 16న అమలు చేయాల్సి మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. నిమిషా ప్రాణాలను కాపాడేందుకు మె కుటుంబం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా యెమెన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. కేరళలోని పాలక్కాడ్ నివాసి అయిన నిమిషా ప్రియకు యెమెన్‌లో మరణశిక్ష విధించారు. అక్కడి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జూలై 16న ఆమెను ఉరితీయనున్నారు. ఆమె ప్రాణాలను కాపాడటానికి భారత ప్రభుత్వం, కుటుంబం , వివిధ సంస్థలు వీలైనంతగా ప్రయత్నిస్తున్నాయి. ఇంతలో షరియా చట్టం ప్రకారం బ్లడ్ మనీ ద్వారా మృతుడి కుటుంబం నుండి క్షమాపణ పొందాలనే ఆశ ఇప్పుడు చివరి ప్రయత్నంగా మిగిలిపోయింది. బాధిత కుటుంబం బ్లడ్ మనీ ఒప్పందానికి అంగీకరిస్తే, నిమిషా ప్రియను మరణ శిక్ష నుండి కాపాడవచ్చు.
ప్రస్తుతం నిమిషా కుటుంబం, భారత ప్రభుత్వం బ్లడ్ మనీతో ఈ విషయాన్ని ఎలాగైనా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాయి. యెమెన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వానికి ఎలాంటి దౌత్య సంబంధాలు లేకపోవడంతో సంప్రదింపులు కష్టతరంగా మారాయి. ఈ దశలో మతగురువు అబుబాకర్ ముస్లియార్ రంగంలోకి దిగి యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరపడంతో తాత్కాలిక ఊరట లభించింది.
ఈ కేసులో ఏం జరిగిందంటే.. కేరళలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియా 2008లో నర్సింగ్ కోసం యెమెన్‌కు వెళ్లింది. 2015లో ఆమె యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీతో కలిసి ఒక క్లినిక్ ప్రారంభించింది. ఐతే వ్యక్తిగత పనుల నిమిత్తం ఆమె కొన్నాళ్లు ఇండియాకు రావాల్సి వచ్చింది. తిరిగి అక్కడికి వెళ్లిన తర్వాత మహదీ తన పాస్‌పోర్ట్‌ను లాక్కుని, తనను హింసించి, క్లినిక్ సంపాదనను లాక్కున్నాడని నిమిషా ఆరోపించింది. దీని తర్వాత, 2017లో, తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందడానికి, నిమిషా మహదీకి అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చింది. ఐతే అది ఓవర్ డోస్ కావడంతో అతడు మరణించాడు. దీంతో నిమిషాకు అక్కడి చట్టాల ప్రకారం యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది.