ఏపీ మంత్రివర్గంలో మార్పులు తప్పవా..? చంద్రబాబు ఆగ్రహానికి కారణాలు ఇవేనా..?
కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై సీఎం ఆగ్రహం
మహిళా ఎమ్మెల్యేను దారుణంగా మాట్లాడితే తిప్పికొట్టరా?
ఇప్పటికీ కొందరు మంత్రుల పనితీరు మారడం లేదు
ఐదుగురు మంత్రులపై చంద్రబాబు అసంతృప్తి
ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. కొందరు మంత్రుల పనితీరు ఆశించినంత సంతృప్తికరంగా లేదని.. మార్పు రావాలని సూచించినా పెద్దగా పట్టించుకోవడం లేదని సున్నితంగా హెచ్చిరించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్, ఆపార్టీ ముఖ్య నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మంత్రులు పూర్తిగా విఫలమవుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికీ ఇలా నిర్లక్ష్యంగా ఉంటే కొత్త మంత్రులు వస్తారని హెచ్చిరించారు.
ఐదుగురు మంత్రులకుపైగా తమ నియోజకవర్గాలతోపాటు వారు ఇంచార్జులుగా ఉన్న జిల్లాల్లోనూ వారు పెద్దగా ఆశించిన మేర పనిచేయడం లేదన్న రిపోర్టు చంద్రబాబుకు వచ్చిందని తెలుస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని వైసీపీ నేతలు దారుణ వ్యాఖ్యలతో కించపరిస్తే మంత్రులు పెద్దగా స్పందించకపోవడంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ నేతలు, మద్దతుదారులు దుష్ప్రచారం చేస్తున్నా.. తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈమెయిల్స్ చేసిన అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని మంత్రులు కోరాగా.. దీనిపై విచారణకు ఆదేశిస్తామన్నారు.
ఇప్పటికే పలుమార్లు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు నిఘా వర్గాలతోపాటు వివిధ మార్గాల్లో నివేదిక తెచ్చిపించుకున్నట్టు తెలుస్తోంది. రాయలసీమకు చెందిన ఓ మంత్రిని పనితీరు మార్చుకోమని స్వయంగా పిలిచి చెప్పినా తీరుమారలేదు. కోస్తా జిల్లాల్లో ఇద్దరు, ఉత్తరాంధ్రలో మరో ఇద్దరు మంత్రుల తీరుపైనా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వానికి అనుకూల పత్రికల్లోనూ మంత్రులపై ఆరోపణలు బ్యానర్ వార్తలుగా వస్తుండంతో మంత్రివర్గంలో మార్పులు ఖాయమన్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. కంప్యూటర్లు కొనుగోలు వ్యవహారంలో మంత్రి గోల్ మాల్, బదిలీల్లో మంత్రి చేతివాటం ఇలాంటి అనేక అంశాల్లో మంత్రుల వ్యవహారశైలిపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే పనితీరు మార్చుకోకుంటే కొత్త మంత్రులు వస్తారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కేబినెట్ లో మార్పులు జరుగుతాయన్న ప్రచారం జరిగింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినపుడే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. ఆయనకు మంత్రిగా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే అది ప్రచారంగానే మిగిలిపోయింది. మంత్రుల పనితీరుపై ఇంటా బయట విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా చంద్రబాబు హెచ్చరికలకే పరిమితం అవుతారా? యాక్షన్ తీసుకుంటారా అనేది చూడాలి.