బెట్టింగ్ యాప్స్ బెండు తీసేందుకు రెడీ అయిన ఈడీ
- పలువురు సెలబ్రిటీలపై కేసు నమోదు
మనీలాండరింగ్ కింద విచారణకు సిద్ధం..
తాఖీదులు రెడీ చేసిన ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారి బెండు తీసేందుకు సమయం సిద్ధం అయ్యింది. ఈ కేసులో ఇప్పటికే కేసులు నమోదు చేసిన హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు విడివిడిగా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు 11 మంది యుట్యూబర్స్ పై కేసులు నమోదు చేసి విచారణ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇందులో కొందరు హైకోర్టుకి వెళ్లి అరెస్ట్ కాకుండా ముందస్తు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఇక సైబరాబాద్ పోలీసులు మాత్రం కేవలం కేసులు నమోదు చేయడానికే పరిమితం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్..ఎక్స్ వేదికగా పోరాటం చేయడంతో పోలీస్ శాఖలో చలనం వచ్చింది. మొదట్లో నానా హడావిడి చేయడంతో బెట్టింగ్ యాప్స్ కి బ్రేక్ పడుతుందని అందరూ భావించారు. అయితే పోలీసులు దీనిపై అంత సీరియస్ గా తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవలే బెట్టింగ్ యాప్స్ లో పెట్టిన డబ్బు కోసం అడిగిన తండ్రిని చంపిన కొడుకు, దొంగిలించి సొత్తుతో బెట్టింగ్ చేసిన యువకులు అంటూ అనేక ఘటనలు నగరంలో చోటు చేసుకున్నాయి. దీనితో మరోసారి పోలీసుల్లో చలనం వస్తుంది అని అందరూ భావించారు. బట్ కేసులు నమోదు.. మీడియాలో వార్తలకే పరిమితం అయ్యింది.
పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో మరోసారి ఈ బెట్టింగ్ యాప్స్ విరుచుకు పడ్డాయి. ముందుకన్న మరింత వేగంగా మార్కెట్లో దూసుకుపోవడంతో 300మందికి పైగానే బాధితులు దీని బారిన పడ్డారు. అయితే ఈ యాప్స్ పై ఈ సారి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఫోకస్ పెట్టారు. యూట్యూబుర్లు, సినిమా హీరో, హీరోయిన్స్ సెలబ్రిటీలు, బెట్టింగ్ యాప్స్ యజమానులపై మనీలాండరింగ్ కింద కేసులు నమోదు చేశారు. వారికి నోటీసులు ఇచ్చి విషయాలు రాబట్టాలని సంకల్పించారు. కోట్ల రూపాయల్లో యాప్స్ ప్రమోట్ చేసేందుకు రెమ్యునరేషన్ తీసుకున్నారని, ఇదంతా హవాలా ద్వారా డబ్బుల పంపకాలు జరిగినట్లు ఈడీ భావిస్తోంది. తీసుకున్న డబ్బు గుట్టు రట్టు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈడీ నమోదు చేసిన కేసులో ప్రఖ్యాత సినీ నటులు, టీవీ సెలబ్రిటీలు, డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు పేర్లు....
రానా దగ్గుబాటి
ప్రకాశ్ రాజ్
విజయ్ దేవరకొండ
మంచు లక్ష్మీ
ప్రణిత సుబాష్
నిధి అగర్వాల్
అనన్య నాగళ్ల
సిరి హనుమంతు
శ్రీముఖి
వర్షిణి సౌందరరాజన్
వసంతి కృష్ణన్
శోభా శెట్టి
అమృతా చౌదరి
నయనీ పవని
నేహా పఠాన్
పండు
పద్మావతి
ఇమ్రాన్ ఖాన్
విష్ణు ప్రియా
హర్ష సాయి
భయ్యా సన్నీ యాదవ్
శ్యామల
టేస్టీ తేజ
రీతు చౌదరి
బండారు శేషయానీ సుప్రీత
ఇది మాత్రమే కాకుండా, బెట్టింగ్ యాప్‌లను నడిపించిన కీలక వ్యక్తులు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు:
బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు......
కిరణ్ గౌడ్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు అజయ్, సన్నీ, సుధీర్.
యూట్యూబ్ చానల్ ‘లోకల్ బాయ్ నాని’
డిజిటల్ వాలెట్ల ద్వారా జరిపిన ఆర్థిక లావాదేవీలు దర్యాప్తులో భాగంగా పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ఈడీకి ఆధారాలు లభించడంతో విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మనీ ట్రైల్, డిజిటల్ ఫుట్‌ప్రింట్లపై దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే కేవలం విచారణ మాత్రమే చేయకుండా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తేనే బెట్టింగ్ యాప్స్ కి బ్రేక్ పడుతుందని జనం కోరుతున్నారు.