APL-2025: వచ్చేస్తోంది ఆంధ్రా ఐపీఎల్.. ఏపీఎల్ వివరాలు ఇవే..! వేలంలోకి నితీష్ కుమార్ రెడ్డి!
ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధం
ఈ నెల 14న ఆటగాళ్ల వేలంపాట
ఈ సారి 7 ఫ్రాంఛైజీలు, 25 మ్యాచ్‌లు
క్రికెట్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మొన్నటి వరకు ఐపీఎల్ (IPL) ఫీవర్‌తో ఊగిపోయిన ఫ్యాన్స్ ను అలరించేందుకు మరోలీగ్ సిద్ధమవుతోంది. ఐపీఎల్ తరహాలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (Andhra Premier League) రెడీ అయిపోతోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఢిల్లీ ప్రీమియర్ లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగ్ అభిమానులను అలరించాయి. ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రా పక్కా లోకల్ లీగ్ రెడీ అవుతోంది. గతంలో నిర్వహించిన ఏపీఎల్ మూడూ సీజన్ల కంటే ఏపీఎల్ సీజన్ 4ను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. క్రికెట్ లో కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడానికి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఒక చక్కటి వేదిక గా నిలుస్తుందని ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు , ఏసీఏ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు.
ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానున్న ఏపీఎల్ సీజన్-4 (APL Season-4) మ్యాచ్ లు ఐపీఎల్ (IPL) తరహాలో నిర్వహిస్తున్నట్లు ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. మీణ ప్రాంతాల్లో వున్న క్రికెట్ ప్లేయర్స్ టాలెంట్ ను వెలికి తీయటానికి ఏపీఎల్ వంటి టోర్నమెంట్ లు దోహదపడతాయన్నారు. గతంలో ఫ్రాంచైజీల ఫీజు 75 లక్షలుగా ఉండగా, ఆ ఫీజు రూ.2 కోట్లకు పెరిగింది. గతంలో 6 ఫ్రాంచైజీలు మాత్రమే ఉండగా..ఇప్పుడు ఆ సంఖ్య ఏడుకి పెరగనుంది.
ఏపీఎల్ -3 సీజన్ లో 430 మంది ప్లేయర్స్ వేలంలో పాల్గొనగా, ఇప్పుడు 520 మందికి పెరగనుంది. వేలం లో పాల్గొనే ప్లేయర్స్ ను 4 కేటగిరీలో విభజించనున్నారు. ఇందులో గ్రేడ్ ఏ లో 21 మంది, గ్రేడ్ బి లో 112 మంది, గ్రేడ్ సి 378 మంది ఉంటారు. ఇండియా క్రికెట్ టీమ్ లో, ఐపీఎల్ లో ఆడిన ప్లేయర్స్ సుమారు 9 మంది టాప్ సీడింగ్ తో వేలంలోకి రానున్నారు. ఈ సీజన్ లోని అన్ని మ్యాచ్‌లకు వైజాగ్ ఆతిథ్యమివ్వబోతోంది. టోర్నీ పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తామని ఏసీఏ తెలిపింది.