వరుసగా రెండో సెషన్లోనూ నష్టాలే
వరుసగా రెండో సెషన్లోనూ నష్టాలే
దేశీయస్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో సెషన్లోనూ మోస్తరు నష్టాల్లో ముగిశాయి. గురువారం ఆద్యంతం రేంజుబౌండ్లో కదలాడాయి. ఆరంభంలో లాభపడిన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో క్రమంగా పతనమయ్యాయి. ఇక ఆర్బీఐ మానిటరీ సమావేశం నేపథ్యంలో వడ్డీరేట్లకు సంబంధించిన స్టాక్స్ డీలాపడ్డాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఎఫ్ఎంసీజీ, రియాల్టి, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు పతనమయ్యాయి. మరోసారి 50రోజుల మూవింగ్ యావరేజ్ నిఫ్టీకి రెసిస్టెన్సీగా మారింది. చివరికి నిఫ్టీ 90, సెన్సె్క్స్ 200 పాయింట్ల మేర నష్టపోయాయి.
క్రితం సెషన్లో 78,271 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం 78,513 వద్ద మొదలైంది. 77,843 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 78,551 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 213 పాయింట్ల నష్టంతో 78,058 వద్ద ముగిసింది. 23,761 వద్ద ఓపెనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,556 వద్ద కనిష్ఠ, 23,773 వద్ద గరిష్ఠ స్థాయుల్ని అందుకుంది. మొత్తంగా 92 పాయింట్లు తగ్గి 23,603 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంకు 39 పాయింట్లు ఎగిసి 50,382 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ50లో 21 కంపెనీలు లాభపడగా 30 నష్టపోయాయి. ఐటీ, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎక్కువ లాభపడ్డాయి. రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, మీడియా, మెటల్, ఎఫ్ఎంసీజీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. సిప్లా, అదానీ పోర్ట్స్, ఐటీసీ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ టాప్ గెయినర్స్. ట్రెంట్, బీఈఎల్, ఎయిర్‌టెల్, టైటాన్, ఓఎన్జీసీ టాప్ లూజర్స్.
ఎన్ఎస్ఈలో నేడు మార్కెట్ బ్రెడ్త్ స్వల్పంగా సెల్లర్లకే అనుకూలంగా మారింది. మొత్తం 2905 స్టాక్స్ ట్రేడవ్వగా 1334 లాభపడ్డాయి. 1495 నష్టపోయాయి. 38 కంపెనీల షేర్లు 52వారాల గరిష్ఠాన్ని అందుకున్నాయి. 32 మాత్రం 52వారాల కనిష్ఠాన్ని చేరాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి సరికొత్త కనిష్ఠానికి పడిపోయింది 87.57 వద్ద స్థిరపడింది. ఎన్ఎండీసీ నికర నష్టం రూ.568 కోట్ల నుంచి రూ.757 కోట్లకు పెరిగింది. ఆర్‌ఈసీ నికర లాభం 23.2% ఎగిసి రూ.3296 కోట్ల నుంచి రూ.4029 కోట్లకు పెరిగింది. ఎంక్యూర్ నికర లాభం 30% వృద్దిరేటుతో రూ.119 కోట్ల నుంచి రూ.156 కోట్లకు ఎగిసింది. ఆర్తి ఫార్మా మార్జిన్ 21.40 నుంచి 23.88 శాతానికి పెరిగింది. నికర లాభం 39.6% మేర పుంజుకుంది. రూ.575 టార్గెట్ ధరతో స్విగ్గీకి బెర్న్‌స్టెయిన్ ఔట్‌పర్ఫామ్ రేటింగ్ ఇచ్చింది. మిండా కార్ప్ నికర లాభం రూ.52 కోట్ల నుంచి రూ.64 కోట్లకు చేరుకుంది. ఎస్బీఐ నికర లాభం 84% వృద్ధిరేటుతో రూ.16,890 కోట్లకు పెరిగింది. చంబల్ ఫర్టిలైజర్స్ లాభం 16.3% పెరిగి రూ.459 కోట్ల నుంచి రూ.534 కోట్లకు ఎగిసింది.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్