భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ

By Ravi
On
భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ

పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్‌
- చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్‌..!
- యుద్ధంతో చావుదెబ్బ తిన్న దాయాది
- రెండురోజుల్లోనే చేతులెత్తేసిన పాక్‌
- లాహోర్‌లో పాక్‌ రాడార్‌ వ్యవస్థ ధ్వంసం
- రావల్పిండిలో ఎయిర్‌బేస్‌పై భారత్‌ దాడులు
- అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ

ఈసారి యుద్ధంతో ఇక పాకిస్తాన్‌ పనైపోతుందని భావించిన భారతీయుల ఆశ మళ్లీ నిరాశగానే మిగిలింది. అగ్రరాజ్యం అమెరికా కలగజేసుకుని ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చింది. దీంతో దాయాది దేశాలు రెండూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు ఇరుదేశాల ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అటు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ కూడా తన ట్వీట్‌లో ఇరుదేశాలు సీజ్‌ ఫైర్‌కు అంగీకరించాయని.. అమెరికా మధ్యవర్తిత్వంతోనే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. దీంతో పాకిస్తాన్‌పై విరుచుకుపడిన భారత్‌ సైన్యం వెనక్కి తిరిగిరాక తప్పడం లేదు. లేదంటే.. ఈసారి యుద్ధంతో పాకిస్తాన్‌ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయేదే. కానీ.. అగ్రరాజ్యం జోక్యంతో పాకిస్తాన్‌ ఈసారికి బతికిపోయింది. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. అంతేకాదు పాకిస్తాన్‌ దగ్గరున్న అధునాతన టెక్నాలజీని కూడా ధ్వంసం చేసింది. ఏకంగా లాహార్‌లోని పాకిస్తాన్‌ రాడార్‌ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అటు రావల్పిండిలో పాక్‌ ఎయిర్‌బేస్‌పై కూడా దాడులు చేసింది. ఇక కచ్‌లోని పోర్టుపై కూడా మన ఆర్మీ విరుచుకుపడింది. దీంతో ఈసారి పాకిస్తాన్‌.. భారత్‌ ముందు మోకరిల్లక తప్పదని అంతా భావించారు. ఎందుకంటే.. గతంలో పాకిస్తాన్‌ యుద్ధాలకు దిగినప్పటి పరిస్థితులు వేరు. కానీ.. ఇప్పుడు భారత్‌ ప్రీప్లాన్డ్‌గా పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేసింది. పాక్‌కు చైనా, టర్కీ తప్ప వేరే ఏ దేశం కూడా మద్దతు పలకలేదు. కనీసం ఇస్లామిక్‌ దేశాలు కూడా పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా నిలబడలేదు. దీనికితోడు పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం.. దాయాది దగ్గర రెండుమూడు రోజులు యుద్ధం చేసే దమ్ము కూడా లేకపోవడంతో.. ఈసారి పాకిస్తాన్‌ని భారత్‌ తన గుప్పిట్లో పెట్టుకుంటుందని అంతా అనుకున్నారు. 

గతంలో భారత్‌తో పాకిస్తాన్‌ యుద్ధాలకు దిగినప్పుడు.. తెరచాటున అగ్రరాజ్యం అండగా నిలబడింది. కానీ.. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక.. పాకిస్తాన్‌కు ఇస్తున్న ఫండ్స్‌ను పూర్తిగా నిలిపివేశాడు. దీంతో పాకిస్తాన్‌ చైనాపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ.. చైనా అంటేనే అవకాశవాది. తెరచాటున పాకిస్తాన్‌ని రెచ్చగొట్టి.. తన పబ్బం గడుపుకునే రకం. కానీ.. పాకిస్తాన్‌ మాత్రం గుడ్డిగా చైనాని నమ్మి ఈసారి బొక్కబోర్లాపడింది. భారత్ యుద్ధ విమానాలు పాకిస్తాన్‌లోకి దర్జాగా వెళ్లి దాడులు చేసినా.. దాయాది దేశం అడ్డుకోలేకపోయింది. ఎందుకంటే.. చైనా దగ్గర పాకిస్తాన్‌ కొనుగోలు చేసిన రక్షణ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేకపోవడమే. చైనా ఆయుధాలను నమ్ముకుని పాకిస్తాన్‌ నిట్టనిలువునా మునిగింది. భారత్‌ యుద్ధ సన్నాహాలు చేస్తున్నప్పుడే అన్ని దేశాల దగ్గరకు వెళ్లి కాళ్లావేళ్లా పడింది. కానీ.. ఏ దేశం కూడా పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వలేదు. దీంతో భారత్‌ ఎప్పుడు దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చుంది. పైకి మాత్రం గంభీరంగా తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని బీరాలు పలికింది. మరోవైపు ఐక్యరాజ్యసమితి దగ్గర తమ గోడును వెళ్లబోసుకుంది. 

పాకిస్తాన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సరిహద్దుల్లో ఎన్ని కవ్వింపు చర్యలకు దిగినా.. భారత్‌ మాత్రం తొందరపడలేదు. అన్నివైపుల నుంచి పాకిస్తాన్‌ను చుట్టుముట్టి.. ఉక్కిరిబిక్కిరి చేసింది. అటు బెలుచిస్తాన్‌తో దాడులు చేయిస్తూ.. ఇటు ఉగ్రవాద శిబిరాల ధ్వంసం చేయడానికి పథక రచన చేసింది. ఇటు ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్స్‌ చేయిస్తూనే.. పాకిస్తాన్‌ను బురిడీ కొట్టించింది. పాకిస్తాన్‌ దృష్టిని మాక్‌డ్రిల్స్‌వైపు మరల్చి.. ఇటు ఉగ్రవాద శిబిరాలను లేపేసింది. దీంతో పాకిస్తాన్‌కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. ఉక్రోశంతో డ్రోన్స్‌తోపాటు యుద్ద విమానాలతో దాడులకు ప్రయత్నించింది. కానీ.. ఇండియన్‌ ఆర్మీ పాకిస్తాన్‌ దాడులను సమర్థవంతంగా అడ్డుకుంది. ఏ విధంగా చూసినా కూడా భారత్‌కు పాకిస్తాన్‌ సరైన ప్రత్యర్థి కాదు. అందుకే చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు భారత్‌ కూడా సీజ్‌ఫైర్‌కు ఓకే చెప్పింది. ఐతే.. ఈ యుద్ధంతో పాకిస్తాన్‌ కోలుకోవాలంటే మాత్రం ఇంకో ఐదేళ్లు పడుతుంది. అది కూడా.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడితేనే. కానీ.. అది జరుగుతుందా..? అన్నది ప్రశ్నార్థకమే. మళ్లీ పాకిస్తాన్‌ ఉగ్రదాడులకు పాల్పడితే మాత్రం.. ఈసారి బొమ్మ కనిపిస్తుందని భారత్‌ కాస్త గట్టిగానే ఈ యుద్ధంతో వార్నింగ్ ఇచ్చింది. అది కేవలం పాకిస్తాన్‌కే కాదు.. ప్రపంచ దేశాలకు కూడా..

Tags:

Advertisement

Latest News

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ
పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్‌- చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్‌..!- యుద్ధంతో చావుదెబ్బ తిన్న దాయాది- రెండురోజుల్లోనే చేతులెత్తేసిన పాక్‌- లాహోర్‌లో పాక్‌ రాడార్‌ వ్యవస్థ...
బడంగిపేటలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ
ఎక్స్ వేదికగా జర్నలిస్టులను అభినందించిన సజ్జనార్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్మకం.. నలుగురు అరెస్టు
అత్తాపూర్ లో ఓ ఇంటిపై దాడి.. అల్ఫాజోలం స్వాధీనం
కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్ల.. నిలదీసిన మహిళలు
జూబ్లీహిల్స్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత