పెళ్లెప్పుడవుతుంది బాబూ..!
రోజురోజుకీ ఎక్కువవుతోన్న పెళ్ళికానివారు..
పిల్లలు పుట్టడంపై ఆ ప్రభావం..!
పెళ్లికాని వారు దేశంలో రోజురోజుకి ఎక్కువవుతున్నారు. ఉన్నత చదువులు, కుటుంబ బాధ్యతలు, ఇతరత్రా కారణాల వల్ల పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. ఆ ప్రభావం వల్ల పిల్లల జననశాతం తక్కువైపోతోంది.
చట్టప్రకారం అబ్బాయిల వివాహ వయసు 21 కాగా.. అమ్మాయిలకు 18 ఏళ్లుగా ఉంది. యుక్త వయసున్న జనాభాలో సగానికి పైగా అంటే.. 51.1 శాతం మందికి వివాహాలు కాలేదు. ఇది పురుషుల్లో 56.3 శాతం కాగా.. మహిళల్లో 45.7 శాతం ఉన్నట్లు తేలింది.
1971-2022 మధ్యకాలంలో దేశజనాభాలో.. 14 ఏళ్లలోపు వయసు ఉన్న బాలల జనాభా 41.2 నుంచి 24.7 శాతానికి పడిపోయింది. ఇదే కాలవ్యవధిలో 15 నుంచి 59 ఏళ్ల వయసు వారి జనాభా జాతీయ స్థాయిలో 53.4 నుంచి 66.3 శాతానికి పెరిగింది. కానీ 60 ఏళ్లు నిండినవారి జనాభా 9 శాతం, 65 ఏళ్లు దాటిన వృద్ధుల జనాభా స్థిరంగా 5.9 శాతంగా కొనసాగుతోంది. రాష్ట్రాల వారీగా 60 ఏళ్లకు మించిన వయసున్న వారి జనాభా అంశంలో తెలంగాణ 8.8 శాతంతో 12వ స్థానంలో ఉంది. ఏపీ 10.1 శాతంతో 6వ స్థానంలో ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో 47.5 శాతం, ఏపీలో 43.7 శాతం పెళ్లికాని వారు ఉన్నారన్న విషయాన్ని జనాభా లెక్కల విభాగం వెల్లడించింది. 2022లో దేశవాప్తంగా నిర్వహించిన జాతీయ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పెళ్లిళ్ల విషయం ఇలా ఉంటే.. దేశజనాభాలో 3.3 శాతం మంది వివాహాలైన తరువాత విడాకులు తీసుకోవడం లేదా జీవిత భాగస్వామితో విడిపోయి.. ఒంటరిగా ఉంటున్నవారు లేదా మరణించినవారు ఉండటం గమనించాల్సిన విషయం.
యువతుల్లో 2.3 శాతం మందికి 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు అవుతున్నాయి. ఇది తెలంగాణలో 1.6 శాతం, ఏపీలో 1.7 శాతంగా ఉంది. ఈ విషయంలో 6.3 శాతంతో పశ్చిమబెంగాల్ మొదటిస్థానంలో ఉంది. బిహార్ జనాభాలో అత్యధికంగా 11.4, రాజస్థాన్‌లో 9.6 శాతముంది. తెలంగాణ 6.5 శాతం, ఏపీ 6.4శాతంతో వరుసగా 12, 13 స్థానాల్లో ఉన్నాయి.