సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..
- భూ వివాదంలో నటుడు రాజీవ్ కనకాల
- రాచకొండ పోలీసుల నోటీసులు
- లేని భూమిని ఉన్నట్లు సృష్టించి బేరం
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఓ భూ వివాదంలో ఆయనకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారు పెద్ద అంబర్‌పేట పసుమూములలో కొన్నేళ్ల క్రితం రాజీవ్ కనకాల ఓ స్థలం కొన్నారు. ఆ తర్వాత ఆ స్థలాన్ని విజయ్ చౌదరి అనే వ్యక్తికి విక్రయించాడు. అనంతరం విజయ్ చౌదరి కూడా ఆ ప్లాటును మరో వ్యక్తికి అమ్మేశాడు. రూ. 70 లక్షలకు ఆ స్థలాన్ని అమ్మేశాడు. అయితే అక్కడ లేని స్థలాన్ని తనకు అమ్మారని బాధితుడు ఆరోపించాడు. తనను మోసం చేసి రూ. 70 లక్షలు కాజేశారని హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు. అయితే ముందుగా ప్లాటును విక్రయించిన రాజీవ్ కనకాలకు సైతం నోటీసులు జారీ చేశారు. ఈ భూవివాదంలో ఆయన పాత్ర ఉందా..? లేని ప్లాటును ఉన్నట్లు చూపించారా..? అనే విషయాలు తెలుసుకునేందుకు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఈ ఘటన సినీ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.