భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
హైదరాబాద్: సికింద్రాబాద్.. రాంగోపాల్ పేట.. మెక్లవుడ్ గూడలో శిధిలావస్థకు చేరుకున్న ఒక పురాతన భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు పోలీసుల సహాయంతో కూల్చివేశారు. అయితే ఈ భవనంలో గత 70 ఏళ్లుగా అద్దెకు నివసిస్తున్న కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కూల్చివేతకు సంబంధించి ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా, కోర్టు ఆదేశాలు లేకుండానే చర్యలు తీసుకోవడం దౌర్జన్యంగా ఉందన్నారు. "ఇల్లు ఖాళీ చేయడానికైనా సమయం ఇవ్వలేదు. ఇంట్లో ఉన్న వస్తువులను బయటకు విసిరేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భవనానికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో నడుస్తున్నప్పటికీ, ఎలా కూల్చివేతలు చేపట్టారో అర్థం కావడం లేదని నివాసితులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఎలాంటి ఆర్డర్లు చూపించకుండానే చర్యలు తీసుకోవడం న్యాయ విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.