గురుడోంగ్మార్ వద్ద ‘మరొక్కసారి’ అరుదైన షూటింగ్
సీకే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘మరొక్కసారి’ భారతీయ సినిమా చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టిబెట్ సరిహద్దు సమీపంలోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన గురుడోంగ్మార్ సరస్సు వద్ద షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమాగా ‘మరొక్కసారి’ నిలిచింది. నితిన్ లింగుట్ల రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, సంజనా సారథి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొటీన్ సినిమా మేకింగ్‌కు భిన్నంగా, కథకు తగ్గ విజువల్ గ్రాండియర్‌ను చూపించాలనే ఉద్దేశంతో చిత్ర బృందం అత్యంత ఛాలెంజింగ్ లొకేషన్లను ఎంచుకుంది. అందులో భాగంగా కేరళలోని సహజ సిద్ధమైన ప్రకృతి అందాల మధ్యతో పాటు, అత్యంత క్లిష్టమైన హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. సముద్ర మట్టానికి సుమారు 5,430 మీటర్లు (17,800 అడుగులు) ఎత్తులో ఉన్న గురుడోంగ్మార్ సరస్సు ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సులలో ఒకటి. ఇలాంటి ప్రాంతంలో షూటింగ్ చేయడం అంటే తీవ్రమైన చలి, తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, పరిమిత షూటింగ్ సమయాలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాయుధ దళాల ప్రత్యేక అనుమతులతో ఈ అరుదైన చిత్రీకరణ జరగడం విశేషం. వాతావరణం క్షణక్షణానికి మారుతుండటంతో షూటింగ్ సమయంలో నటీనటులు, సాంకేతిక బృందం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు, కఠినమైన భూభాగం, పరిమిత రవాణా సౌకర్యాలు, భారీ ఎక్విప్‌మెంట్ తరలింపు, కమ్యూనికేషన్, విద్యుత్ పరిమితులు వంటి లాజిస్టిక్ సమస్యలు కూడా పెద్ద సవాలుగా మారాయి. ఈ మొత్తం షెడ్యూల్‌లో నటీనటులు, టెక్నికల్ టీమ్ ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రొడక్షన్ హెడ్ అనుదీప్ పడురు కీలక పాత్ర పోషించడంతో షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం ‘మరొక్కసారి’ సినిమా షూటింగ్ పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీఐ వర్క్ జరుగుతుండగా, ఫైనల్ కలర్ గ్రేడింగ్, విజువల్ ఫినిషింగ్ పనులతో సినిమాకు సంపూర్ణ విజువల్ టోన్ అందిస్తున్నారు. రోహిత్ బచు ఛాయాగ్రహణం, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్, భరత్ మాంచిరాజు సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అన్ని పనులు పూర్తయ్యాక త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.

.jpeg)