గాయంతో ఫీల్డింగ్ కు దూరమైన స్టీవ్ స్మిత్..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్. ఆ టీమ్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తీవ్రంగా గాయపడ్డాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఫైనల్లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అతడు.. తెంబా బవుమా క్యాచ్ పట్టే టైమ్ లో గాయపడ్డాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో బౌన్స్ అయిన బంతిని బవుమా ఆడగా.. గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న స్మిత్ క్యాచ్‌ను పట్టుకోబోయాడు. కానీ, క్యాచ్ చేజారింది. బంతి వేలికి బలంగా తాకడంతో స్మిత్ నొప్పితో విలవిలలాడుతూ మైదానం నుండి వెళ్ళిపోయాడు. టీ సెషన్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన అతడు.. మళ్లీ ఫీల్డింగ్ కు రాలేదు. ఆసీస్ మెడికల్ టీమ్ స్మిత్ కు స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా.. కుడిచేతి చిటికెన వేలులో ఎముకకు గాయం తగిలినట్టు గుర్తించారు. దాంతో, విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించడంతో అతడు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. స్మిత్ కుడిచేతి చిటికెన వేలు ఎముక పక్కకు జరిగిందని ఓ ప్రకటనలో తెలిపింది.