ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు
- టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతో మోసాలు..
భర్తకు బదులు మరొకరి వీర్యంతో జీవితాలు ఆగం చేసిన నిర్వాహకులు..
దేశవ్యాప్తంగా బ్రాంచ్ లు..
సికింద్రాబాద్ లో వెలుగు చూసిన యూనివర్సల్ మోసాలు..
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
సికింద్రాబాద్ గోపాలపురం యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక మహిళ తన భర్త వీర్య కణాలతో గర్భం కావాలని.. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించగా.. భర్తకు బదులుగా వేరే వ్యక్తి వీర్య కణాలతో గర్భం కలిగించినట్లు తెలిసింది. ఇప్పటికే బాధితులను నుండి రూ. 15లక్షలు వసూలు చేశారు. గర్భం దాల్చాలి అంటే రూ. 30లక్షలు చెల్లించాలి. బాధితుల ఫిర్యాదు మేరకు డీఎన్‌ఏ పరీక్షలో ఇది రుజువు కావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నార్త్ జోన్ డీసీపీ సాధన లక్ష్మి పెరమల్ సారథ్యంలో శనివారం సాయంత్రం నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు తనిఖీలు కొనసాగాయి.
పోలీస్ అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది పలువురి నుండి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఆసుపత్రిలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న వైద్యశాఖ అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు. దీంతో ఆసుపత్రి సిబ్బందిని మరోచోటికి తరలించారు. ఇదిలావుండగా, వీర్య కణాల అక్రమ సేకరణ గుట్టు రట్టు చేశారు. క్లినిక్ నిర్వాహకులు యువకులకు డబ్బు ఆశ చూపి పోర్న్ వీడియోలు చూపిస్తూ.. వీర్య కణాలను సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 16 వీర్య కణాల శాంపిల్స్‌ను స్వాధీనం చేసుకుని DMHO (జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి)కి అప్పగించారు. నిందితులు సరోగసీ కోసం వీర్య కణాలను సేకరిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఇక్కడ సేకరించిన శాంపిల్స్‌ను అహ్మదాబాద్‌కు పంపుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కేసులో సెంటర్ యజమాని నమ్రతా, ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాల అక్రమాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నట్లు వెల్లడైంది. విశాఖపట్నం, విజయవాడల్లోని ఈ సంస్థ బ్రాంచీల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కోల్‌కతాలలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాలు బ్రాంచీలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఆసుపత్రి నిర్వాహకులపై గతంలో కేపీహెచ్‌బీ, గోపాలపురం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఓ వైద్యురాలి లైసెన్స్ రద్దు చేసినప్పటికీ, మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక ఈ ఘటన హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అక్రమ సరోగసీ, వీర్య కణాల సేకరణ కేంద్రాలపై తీవ్ర చర్చకు దారితీశాయి. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.