కడప జిల్లాలో కలకలం రేపిన విద్యార్థిని హత్య! చంపింది అతడేనా?
గండికోటలోని ముళ్లపొదల్లో అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
ముళ్లపొదల్లో..ఒంటిపై వస్త్రాలు లేకుండా పడి ఉన్న బాలిక
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని పర్యాటక కేంద్రమైన గండికోటలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రొద్దుటూరు పట్టణం సార్వకట్ట వీధికి చెందిన ప్రైవేట్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న మైనర్ విద్యార్థిని ముళ్లపొదల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. సోమవారం ఉదయం 8 గంటలకు స్నేహితులతో కలిసి గండికోటకు వెళుతున్నట్టు తల్లిదండ్రులతో చెప్పి వెళ్లింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో విద్యార్థిని కళాశాలకు రాలేదని కళాశాల యాజమాన్యం విద్యార్థిని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం చెప్పారు. ఉదయం 8 గంటలకే తమ కుమార్తె కాలేజీకి వచ్చిందని కుటుంబ సభ్యులు కాలేజీ వద్దకు వచ్చి అమ్మాయికోసం విచారించారు. కాలేజీకి వెళ్లలేదంటే స్థానిక గండికోటకే వెళ్లి ఉంటారన్న విషయం కాలేజీలో విద్యార్థుల ద్వారా నిర్ధారించుకుని కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, గండికోటకు వెతికేందుకు వెళ్లారు.
ముళ్లపొదల్లో..ఒంటిపై వస్త్రాలు లేకుండా పడి ఉన్న బాలిక
ఆ రోజు సాయంత్రం వరకు ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. చీకటిపడే సమయానికి గండికోట పైభాగంలో విద్యార్థిని కాలేజీ బ్యాగు, చున్ని కనిపించాయి. దీంతో పోలీస్ జాగిలంతో తనిఖీలు చేశారు. ఆ చుట్టుపక్కల వెతికితే మైనర్ బాలిక ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు మంగళవారం ఉదయం గండికోటలో ముళ్ల పొదల్లో విగత జీవిగా మైనర్ బాలిక కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కనీసం శరీరంపై వస్త్రాలు కూడా లేకుండా విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. హత్య విషయం తెలుసుకున్న సమీప ప్రాంతాల ప్రజలు, బంధువులు పెద్దఎత్తున గండికోటకు చేరుకున్నారు.
ఎర్రగుంట్ల మండలం హనుమన గుత్తి గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడే హత్యకు కారకుడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొద్దుటూరులోనే తన ద్విచక్ర వాహనంలో విద్యార్థినిని ఎక్కించుకొని దాదాపు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో గండికోటకు చేరుకుని, తిరిగి మంగళవారం ఉదయం 10:47 గంట ల ప్రాంతంలో లోకేష్ ఒక్కడే తన ద్విచక్ర వాహనంలో గండికోట నుంచి బయటికి వచ్చేసినట్టు సిసి పుటేజీలో రికార్డు అయింది. అనుమానంతో లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అతను ఇచ్చిన సమాచారం మేరకే బాలిక మృతదేహం ఉన్న ప్రాంతాన్ని పోలీసులు, కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం గుర్తించినట్లు తెలుస్తోంది. మైనర్ విద్యార్థినిని హత్య చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు అసలు ఒక్కరే ఇంతటి దారుణ హత్యకు పాల్పడతారా.. ? లేదా ఈ కేసులో మరి కొంతమంది ఏమైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నామని, పోలీసుల జాగిలాలు వచ్చి పరిశీలించాక మిగతా వివరాలు వెల్లడిస్తామని జమ్మలమడుగు డిఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.
గండికోటలో విద్యార్థిని హత్య స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
గండికోటలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతదేహం కలకలం రేపిన విషయం తెలుసుకున్న ఎస్పీ అశోక్ కుమార్ ఘటనా స్థలానికి డిఎస్పీ భావనతో కలిసి చేరుకుని విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాలిక కనిపించలేదని మిస్సింగ్ కేసు నమోదైందని, గాలింపులో బాలిక మృతదేహం ఇక్కడ ఉన్నట్లు తేలడంతో ఇంకా విచారణ జరుగుతోందని ఎస్పీ అశోక్ వెల్లడించారు. త్వరలోనే విచారణ జరిపి కేసుకు సంబంధించిన పూర్తి విషయాలను తెలియజేస్తామన్నారు.