మత్తుకి బానిసై యువత జీవితం నాశనం చేసుకోవద్దు.. డీజీపీ జితేందర్
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ లో 10 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే పోలీస్ స్టేషన్లకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, డిఐజి తాప్సీర్ ఎగ్బాల్, ఎస్పీ నారాయణరెడ్డి, హౌసింగ్ ఐజిపి రమేష్ లతో కలిసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ కొడంగల్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శంకుస్థాపనలు గావించి శుక్రవారం నాడు భూమి పూజ చేశారు. కొడంగల్ పోలీస్ స్టేషన్ 2.96 కోట్లు, సర్కిల్ పోలీస్ స్టేషన్ 84.50 లక్షలు, దుద్యాల పోలీస్ స్టేషన్ 3 కోట్లు, బొమ్మరాస్ పెట్ 2.96 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టే పనులకు డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ జనరల్ జితేందర్ శంకుస్థాపన గావించారు.
అనంతరం డీజీ జితేందర్ మాట్లాడుతూ... ప్రజల సౌకర్యార్థం అధునాతన సౌకర్యాలతో పోలీస్ స్టేషన్ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. కొడంగల్ పరిధిలో 10 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టే పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని అని ఆయన తెలిపారు. పోలీస్ స్టేషన్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని వస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదకద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి మాదకద్రవ్యాల తరలింపు పై ప్రత్యేక నిఘాతో దోషులను గుర్తించడంతోపాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. యువత
చెడు వ్యసనాలకు గురి కావడం వల్ల కుటుంబాలు చెల్లాచెదురు అవుతున్నాయని, ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్ధానాలను తెలుసుకొని తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు. పోలీస్ స్టేషన్ల శంకుస్థాపన కార్యక్రమంలో తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, పరిగి డిఎస్పి శ్రీనివాస్, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, తహసిల్దార్ విజయకుమార్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.