గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి - సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్
గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. శనివారం సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి గ్రామ పాలన అధికారి పరీక్షల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ గౌతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ మే 25న ఆదివారం ఉదయం 10 30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లాలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు ఉదయం 8 గంటల వరకు జవాబు పత్రాలను, 9.20 గంటల వరకు ప్రశ్నా పత్రాలను తరలించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మేర ఇన్విజిలేటర్ నియమించాలని, అభ్యర్ధులు ఏ విధమైన ఎలక్ట్రానిక్ మరియు వాచీలు తీసుకురావద్దని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్ల తో మెడికల్ టీం ఏర్పాటు చేయాలని, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల రూట్ లలో బస్సు నడపాలని అన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ పక్కల జిరాక్స్ షాపులు మూసి వేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియ, తహాసీల్దారు స్వామి కూకట్ పల్లి తహాసీల్దారు కార్యాలయం నుండి పాల్గొన్నారు.