నన్ను వేశ్యలాగా చూశారు..వివాదాస్పదమైన మిస్ వరల్డ్ పోటీలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు అపవాదును మూటగట్టుకుంది. ఈ పోటీల్లో ఖండాల వారీగా 24 మంది విజేతలను ఎంపిక చేశారు. వారిలో ఇండియా తరపున నందిని గుప్తా కూడా ఉన్నారు. ఈనెల 31న హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే పోటీ ఉండనుండగా.. ఫైనల్ రౌండ్లో ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ ఆర్గనైజర్లు తనను వేశ్య లాగా చూశారంటూ అందాల పోటీల నుంచి ఓ కంటస్టెంట్ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.పోటీల నుంచి వైదొలిగిన వ్యక్తి మిస్ ఇంగ్లండ్ " మిల్లా మాగీ ". 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో కంటెస్టెంట్ ఇలా మధ్యలో వెళ్లిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మేరకు ఆమె పోటీల నుంచి తప్పుకున్న తర్వాత ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ముందు ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా.. ఇంటర్వ్యూ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పారంటే.. మిస్ వరల్డ్ పోటీదారులను ఎప్పుడు మేకప్తోనే ఉండేలా చేస్తున్నారని.. టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదని అన్నారు. అంతే కాకుండా సాయంత్రం నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో భాగంగా మేల్ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తుందని తెలిపారు. ఎప్పుడూ బాల్ గౌన్లోనే ఉండాలని.. ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలంటూ తమ మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. తమని వేశ్యలు లాగా చూస్తున్నారంటూ మాగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా వినోదం కోసం తమను వీధుల్లో తిప్పారని మాగీ వాపోయారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో స్ఫూర్తి నింపేందుకు పోటీలో పాల్గొన్నానని.. కానీ అక్కడ పరిస్థితులు వేరని.. కొందరిని సంతృప్తి పరిచేందుకు కోతుల్లా ప్రదర్శన ఇచ్చేందుకు కాదంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. అందుకే మనస్తాపంతో పోటీల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.మిల్లా మాగీ ఈ పోటీ నుంచి వైదొలగడంతో ప్రస్తుతం ఆమె స్థానంలో మిస్ లివర్పూల్ అయిన 25 ఏళ్ల షార్లెట్ గ్రాంట్ మిస్ వరల్డ్ ఫైనల్లో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా మండిపడింది. గతంలో అందాల పోటీకి వచ్చిన సుందరీమణుల పాదాలను స్థానిక మహిళలతో కడిగించి తెలంగాణ సంస్కృతీసంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని.. ఇప్పుడేమో ఈ తరహా కామెంట్స్ ఓ కంటస్టెంట్ చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని రాసుకొచ్చారు.