ఆపరేషన్ సూరత్ షురూ..20మంది ఖేల్ ఖతం
ఆపరేషన్ సింధూర్ ముగిసింది.. సూరత్ మొదలైంది
ఆర్ధిక దోపిడీ చేసిన 20మంది ఖేల్ ఖతం
రాష్ట్రం దాటి పదిరోజులపాటు ఆపరేషన్ కొనసాగించిన తెలంగాణ పోలీసులు
రెండు బృందాలుగా విడిపోయి నిందితులకు చెక్ పెట్టిన పోలీసులు
ఆపరేషన్ సింధూర్ మనందరికీ తెలుసు పల్గావ్ ఘటనపై మన భారతదేశం. పాకిస్తాన్ కోరలు పీకిన సందర్భం. అచ్చం అదే తరహాలో మన తెలంగాణ పోలీసులు ఆపరేషన్ సూరత్ నిర్వహించారు. ఉగ్రవాదులు మన భారతీయుల ప్రాణాలు తీస్తే.. ఈ నేరస్థులు ప్రజలపై ఆర్ధిక దోపిడీకి పాల్పడి వారిని రోడ్డున పడేశారు. అందుకే ఆపరేషన్ సూరత్ పదిరోజులపాటు నిర్వహించి 20మంది ఖేల్ ఖతం చేశారు. ఎస్ ఇది నిజం. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.
గుజరాత్‌లోని సూరత్‌లో మకాం వేసి మోసాలకు పాల్పడుతున్న 20 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో వీరంతా నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన నిందితులను సూరత్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా అనేక మందిని మోసం చేస్తున్న సైబర్ ముఠాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో పలు కేసుల్లో నిందితుల జాడ గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెండు ప్రత్యేక బృందాలను సూరత్‌కు పంపించారు. అక్కడ సుమారు పది రోజుల పాటు రహస్యంగా ఆపరేషన్ నిర్వహించి, కీలక సమాచారం సేకరించి 20 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారిలో ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వ్యాపారులు, డీసీబీ బ్యాంకుకు చెందిన వాపి బ్రాంచ్ రిలేషన్‌షిప్ మేనేజర్ కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరంతా పెట్టుబడుల పేరుతో ఆశ చూపడం, పార్ట్ టైం ఉద్యోగాల ఎర వేయడం వంటి పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు. ఈ ముఠా సభ్యులపై కేవలం తెలంగాణలోనే సుమారు 60 కేసులు నమోదై ఉండగా, దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 515కు పైగా కేసులు ఉన్నట్లు వెల్లడైంది.
నిందితుల నుంచి 20 మొబైల్ ఫోన్లు, 28 సిమ్‌కార్డులు, 4 ఏటీఎం కార్డులు, 5 చెక్కు పుస్తకాలు, 2 రబ్బరు స్టాంపులతో పాటు నేరాలకు ఉపయోగించిన ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కార్యకలాపాలు, బాధితుల సంఖ్యపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.