ఆ బాలిక స్కూల్ టాపర్ గా నిలిచింది.. కాని విధే ఆమెను వెంటాడింది.
పరీక్షల్లో ఆ బాలిక స్కూల్ టాపర్ గా నిలిచింది. ఈ విషయం తెలిసిన స్కూల్ టీచర్స్ ఆ అమ్మాయిని అభినందించడానికి ఇంటికి వెళ్లారు.. అక్కడికి చేరుకోగానే విషయం తెలుసుకుని కంటతడి పెట్టారు. ఆ ఆనందం పంచుకోవడానికి ఆ బాలిక ఇప్పుడు లేదని తెలిసి తట్టుకోలేక పోయారు. తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఓ బాలిక స్కూల్ టాపర్‌గా నిలిచింది. కష్టపడి చదివి, పది ఫలితాల్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది. అయితే, ఆమెను విధి వెక్కిరించింది. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమెను లేకుండా చేసింది. ఎందుకంటే పరీక్షలు పూర్తయిన 13 రోజులకు ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రవి, రజిత దంపతుల కూతురు ఆకుల నాగచైతన్య అదే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పరీక్షలకు హాజరైంది. అలా పరీక్షలు పూర్తయిన 13 రోజులకు ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. చివరికి ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 17న చనిపోయింది. అయితే బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆమె 600 మార్కులకు గాను 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్‌గా నిలిచింది. కానీ ఆ సంతోషాన్ని పంచుకునేందుకు కూతురే లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.