పోటాపోటీగా ఎక్సైజ్ టీమ్ ల దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం
ఎస్టిఎఫ్ డిటిఎఫ్ టీమ్‌లు ఐదు కేసుల్లో 7.750 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని పలువురిపై కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. శేర్‌లింగంపల్లి గోపన్నపల్లిలో 3 కేజీల గంజాయిని డిటిఎఫ్ సీఐ ప్రవీణ్‌కుమార్ సిబ్బంది పట్టుకున్నారు.
ఈ కేసులో ఒరిస్సా మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన బెలాల్ బేపారీ, రాహుల్ హక్ అలియాస్ రుహుల్‌లను అరెస్టు చేసి శేర్‌లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.
ఎస్టిఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజి రెడ్డి అధ్వర్యంలో రెండు కేసుల్లో గంజాయిని పట్టుకున్నారు. జిన్సీ చౌరాయి ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుపుతుండగా 1.230 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు.
ఈ కేసులో శివసింగ్ ను అరెస్టు చేశారు. లఖాన్‌సింగ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అలాగే నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 1.2 కేజీల గంజాయి పట్టుకొని కాంబ్లే సునీల్, యు. గణేష్‌లను అరెస్టు చేశారు. మరో ఇద్దయూ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
మరొకేసులో
ఎస్టిఎఫ్ సీ టీమ్ సీఐ వెంకటేశ్వర్ల టీమ్ ఒరిస్సా మల్కాన్‌గిరి ప్రాంతానికి చెందిన నిత్యానందా బిశ్వాస్ వద్ద 1.2 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని ధూల్‌పేట్ ప్రాంతంలో పట్టుకున్నారు. నిందితుడిని, గంజాయిని ధూల్‌పేట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.
లంగర్ హౌస్ ఫ్లైఓవర్ గోల్కొండ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న సమాచారం మేరకు ఎస్టిఎఫ్ డి టీం దాడులు నిర్వహించి 1.12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని సీఐ నాగరాజు తెలిపారు.
ఈ కేసులో షేక్ మహమ్మద్ ఖలీల్ ను గోల్కొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్ లో అప్పగించారు.