ఎస్సీ వర్గీకరణ అనంతరం జాబ్ క్యాలెండర్ వేగం పెంపు
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తికాగానే జాబ్ క్యాలెండర్ వేగంగా అమలులోకి వస్తుందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా. రియాజ్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని దిల్‌షుఖ్‌నగర్‌లో రామయ్య కోచింగ్ సెంటర్ ఆన్లైన్ బుక్స్ వెబ్‌సైట్‌ను సెంటర్ డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా డా. రియాజ్ మాట్లాడుతూ, ఉద్యోగాల కల్పన వ్యయం భరించలేని వ్యవహారం కాదు, భవిష్యత్ నిర్మాణానికి భాగమని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణతో పాటు కొన్ని సాంకేతిక ఇబ్బందులు పరిష్కారమైన తరువాత జూన్ 2న ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు, నిరుద్యోగులు లైబ్రరీల్లోని వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఆన్లైన్ వెబ్‌సైట్ ద్వారా గ్రూప్స్, పోలీస్, టెట్, డీఎస్సీ వంటి పరీక్షలకు అవసరమైన పుస్తకాలను ‘గర్ గర్, గల్లి గల్లి, గావ్ గావ్’ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. రామయ్య కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నిరుద్యోగులు ఈ వెబ్‌సైట్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.