మెట్రోలో సాంకేతిక లోపం.. అవస్థలు పడ్డ ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు గురువారం తీవ్ర అంతరాయం నెలకొంది. సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 20 నిమిషాలపాటు అంతరాయం కలిగింది. దీంతో మెట్రో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు రైలు సేవల్లో అంతరాయం కలిగింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ రూట్లో.. భరత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద దాదాపు 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ఆ మార్గంలోని ప్రతి మెట్రో స్టేషన్లో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఎంతసేపటికీ కదలకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.కొందరు ప్రయాణికులు మెట్రో స్టేషన్ల నుంచి బయటికి వచ్చి ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు బయల్దేరారు. సాంకేతిక కారణాలతోనే రైలు సేవలకు అంతరాయం కలిగిందని మెట్రో యాజమాన్యం వెల్లడించింది. టెక్నికల్ ఇష్యూను సరి చేయడానికి తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు తెలిపింది. కాగా మే 1వ తేదీన ప్రభుత్వ సెలవు దినం కావడంతోరైళ్లలో రద్దీ కాస్త తక్కువగా ఉంది.