మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల పెంచిన ప్రయాణ ఛార్జీల విషయంలో మెట్రో రైలు యాజమాన్యం పునరాలోచన చేసి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ, వాటిని 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ నిర్ణయంతో ప్రయాణికులపై ఆర్థిక భారం కొంతమేర తగ్గనుంది. ఇటీవల ఛార్జీల పెంపుపై ప్రయాణికుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో ఈ సవరణ చేసినట్లు తెలుస్తోంది. తగ్గించిన ఈ కొత్త ఛార్జీలు ఈ నెల 24వ తేదీ నుంచి వర్తిస్తాయని మెట్రో యాజమాన్యం స్పష్టం చేసింది. నగరంలో రోజూ మెట్రో సేవలను వినియోగించుకునే వేలాది మందికి ఈ నిర్ణయం ప్రయోజనంగా మారనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి పెరిగిన మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గరిష్ఠ టికెట్ ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. ఇలా కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు ఛార్జీలు పెంచినట్లు ఎల్ అండ్ టీ ప్రకటించింది. అయితే ఈ పెరిగిన ధరలో 10 శాతాన్ని తగ్గించాలని హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం నిర్ణయించింది.