రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
జమ్మూకాశ్మీర్ ఘటనతో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో బుధవారం కీలక భద్రతా విన్యాసాలు (మాక్ డ్రిల్స్) నిర్వహించనున్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పౌరులను, భద్రతా సిబ్బందిని సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ మాక్ డ్రిల్స్ చేపడుతున్నారు. నగరంలోని నాలుగు వ్యూహాత్మక ప్రాంతాలైన సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్‌బాగ్ డీఆర్‌డీఓ (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ), మౌలాలిలోని ఎన్‌ఎఫ్‌సీలలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ భద్రతా విన్యాసాలు ఏకకాలంలో జరగనున్నాయని రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 259 సున్నిత ప్రదేశాలలో ఈ మెగా సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మాక్ డ్రిల్స్ నిర్వహణపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, దాడులకు అవకాశం ఉన్న ప్రాంతాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు కేటగిరీ-2లో ఉన్నాయి