లైసెన్స్ లేని మందుల షాప్ పై డిసిఏ దాడి.. ఔషధాలు స్వాధీనం
తెలంగాణా ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు అక్రమంగా మందుల విక్రయాలపై దాడులు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, వెస్ట్ వెంకటాపురం, బ్యాంక్ కాలనీలో ఉన్న ఒక మెడికల్ షాపులో సోదాలు జరిపారు. వై.వి. సుబ్బా రావు అనే వ్యక్తి ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేకుండానే అక్రమంగా మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. రైడ్ సమయంలో, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పెద్ద మొత్తంలో అనధికారికంగా నిల్వ ఉంచిన మందుల స్టాక్‌ను గుర్తించారు. ఆ ప్రాంగణంలో విక్రయాల కోసం నిల్వ ఉంచిన 20 రకాల మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో డా. కె. ప్రభాకర్, అసిస్టెంట్ డైరెక్టర్, కుత్బుల్లాపూర్, కె. మురళీకృష్ణ, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, మల్కాజిగిరి ఈ. తిరుపతి, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, కుత్బుల్లాపూర్ పాల్గొన్నారు. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు నమూనాలను సేకరించారు. డ్రగ్ లైసెన్స్ లేని షాపులకు మందులు సరఫరా చేసే హోల్సేల్ డీలర్లు/వ్యాపారులపై కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చని, హోల్సేల్ డీలర్లు/వ్యాపారులు మందులు సరఫరా చేసే సంస్థలు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రగ్ లైసెన్స్ కలిగి ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని అధికారులు తెలిపారు. తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం మందుల నిల్వ మరియు విక్రయాల కోసం డ్రగ్ లైసెన్సులను జారీ చేస్తుందని ఈ విషయం తప్పక గమనించాలని అన్నారు.