ఆదిలాబాద్ బస్ డిపోను తనిఖీ చేసిన ఎండి సజ్జనార్
ఆదిలాబాద్ డిపో, బస్ స్టేషన్ ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సోమవారం తనిఖీ చేశారు. డిపో పరిధిలోని తిరుగుతున్న సర్వీసులు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డ్రైవర్లు, కండక్టర్లతో పాటు గ్యారేజీ సిబ్బందితో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో మహాలక్ష్మి-మహిళలకు ఉచిత రవాణా అమలు తీరును ఆరా తీశారు. అలాగే బస్టాండ్ లోని ప్రయాణికులతో మచ్చటించారు. బస్ స్టేషన్ లో ఆర్టీసీ అందిస్తోన్న సేవలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ తో కూడిన కీ చైన్ లను ప్రయాణికులకు అందజేశారు. ఈ సందర్భంగా వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తుండటం వల్లే సంస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సంస్థ సమకూర్చుకుంటోందని చెప్పారు. గత మూడేళ్ళలో 50 శాతం మేర కొత్త బస్సులను వాడకంలోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేలా సంస్థ ప్లాన్ చేస్తోందని వివరించారు. ఆదిలాబాద్ లోని పర్యాటక ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ అంశాలను దశలవారీగా పరిష్కరించేలా యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.