తెలంగాణలో పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు.. పరుగులు పెట్టిన జనాలు
తెలంగాణ ఉత్తర ప్రాంతంలోని జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూమి కంపించింది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడం, భూమి కొద్ది సెకన్ల పాటు కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో బయటకు పరుగులు తీశారు. జిల్లా వ్యాప్తంగా ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. జిల్లాలోని చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కొన్ని క్షణాల పాటు తీవ్రంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇళ్లు, భవనాలు కూడా కంపించాయని వారు చెప్పారు. కొందరు స్థానికులు రెండు సార్లు భూమి తీవ్రంగా కంపించిందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని సమాచారం. భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. కొందరు ఇండ్లు వదిలి భయంతో బయటకు పరుగులు తీశారు.